కసాపురంలో ఆన్‌లైన్ సేవలు ప్రారంభం
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో మంగళవారం ఆన్‌లైన్ సేవలు ప్రారంభమయ్యాయి. ఈఓ మేడేపల్లి విజయరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, దేవదాయశాఖ ఆదేశానుసారం ఆలయంలో స్వామివారి దర్శనం, ప్రసాదాలు, వసతి గదులు, వివిధ ఆర్జిత సేవల ఆన్‌లైన్ బుకింగ్ కౌంటర్ ప్రారంభించినట్లు తెలిపారు. www.aptemple.com ను సంప్రదించి కసాపురం ఆలయానికి సంబంధించిన సేవలను పొందవచ్చని తెలిపారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గుంతకల్లు–మార్కాపురం మధ్య త్వరలో కొత్త రైళ్లు
గుంతకల్లు: శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనార్థం గుంతకల్లు – మార్కాపురం మధ్య కొత్త ప్యాసింజర్ రైళ్లను తర్వలోనే ప్రవేశపెట్టనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గుంతకల్లు జంక్షన్ నుంచి ఈ రైలు (57407) రోజూ సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి నంద్యాల జంక్షన్‌కు రాత్రి 8.20 గంటలకు, మార్కాపురం రోడ్డు రైల్వేస్టేషన్‌కు 11.30 గంటలకు చేరుతుందని పేర్కొన్నారు. తిరిగి ఈ రైలు మార్కాపురం రోడ్డు రైల్వేస్టేషన్ నుంచి (57408) ఉదయం 4.30 గంటలకు బయలుదేరి నంద్యాల జంక్షన్‌కు ఉదయం 7.20 గంటలకు గుంతకల్లు జంక్షన్‌కు ఉదయం 10.30 గంటలకు చేరుతుందని తెలిపారు. ఈ రైలు మద్దికెర, పెండేకల్లు, డోన్, రంగాపురం, బేతంచెర్ల, పాణ్యం, నంద్యాల, గాజులపల్లి, దిగువమిట్ట, గిద్దలూరు, సోమిదేవిపల్లి, జగ్గంబోట్ల కృష్ణపురం, కుంభం, తర్లుపాడు మధ్య రాకపోకలు సాగిస్తుందని పేర్కొన్నారు.
హిందూపురంలో
ఆగనున్న ‘వందే భారత్’
హిందూపురం: వందే భారత్ రైలు హిందూపురం రైల్వేస్టేషన్‌లో స్టాపింగ్‌కు రైల్వే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాచిగూడ–యశ్వంత్‌పుర్ వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (20703)కు 27న హిందూపురంలో కేంద్ర రైల్వే సహాయ మంత్రి సోమన్న జెండా ఊపి ప్రారంభించనున్నారు. తర్వాత నూతనంగా పునరుద్ధరించిన చాకార్లపల్లి రైల్వేస్టేషన్‌ను కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి ప్రారంభించనున్నారు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నంబర్ 20703 తెల్లవారుజామున 5.45 కాచిగూడ నుంచి బయలుదేరి హిందూపురానికి మధ్యాహ్నం 12.00కు వస్తుంది. ఇక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.00 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుతుంది. అలాగే తిరిగి వందేభారత్ రైలు యశ్వంత్‌పూర్‌లో మధ్యాహ్నం 2.45 బయలుదేరి తిరిగి హిందూపురానికి 3.30 గంటలకు చేరుతుందని అధికారులు తెలిపారు. ఇక్కడి నుంచి బయలుదేరి అదేరోజు రాత్రి 11 గంటలకు కాచిగూడకు చేరుతుందన్నారు.
కసాపురంలో ఆన్‌లైన్ సేవలు ప్రారంభం


