యూత్ ఏషియన్ క్రీడాకారునికి అభినందన
అనంతపురం కార్పొరేషన్: దుబాయిలో ఈ నెల 7 నుంచి 14 వరకు జరిగిన యూత్ ఏషియన్ పారా గేమ్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో జిల్లాకు చెందిన నరేష్ సత్తా చాటాడు. టీ44 కేటగిరీ 400 మీటర్ల పరుగు పందెంలో నరేష్ వెండి పతకం సాధించాడు. ఈ సందర్భంగా మంగళవారం కలెక్టరేట్‌లో నరేష్‌ను కలెక్టర్ ఆనంద్ అభినందించారు. ఇదే స్ఫూర్తితో మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఎస్‌డీఓ మంజుల, తదితరులు పాల్గొన్నారు.
నిర్మాణపనులు వేగవంతం కావాలి
అనంతపురం అర్బన్: జాతీయ రహదారి నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ జాతీయరహదారి శాఖ నూతన ఎన్‌ఈ జి.సంజీవరాయుడుకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని చాంబర్‌లో కలెక్టర్‌ను సంజీవరాయుడు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయరహదారి నిర్మాణ పనుల త్వరిగతగతిన పూర్తిచేయడంపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు.
కొత్త పింఛన్లు లేవు
● అర్జీలతో కార్యాలయాలకు రావొద్దు
అనంతపురం టౌన్: ఎన్టీఆర్ భరోసా కింద కొత్త పింఛన్లు ఇవ్వడం లేదు. అర్హులైన దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితర కేటగిరీల వారు పింఛన్ కోసం అర్జీలతో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో డీఆర్‌డీఏ పీడీ శైలజ మంగళవారం స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రానందున ఎవ్వరూ కలెక్టరేట్, మున్సిపల్, ఎంపీడీఓ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా పింఛన్ వస్తున్న జీవత భాగస్వామి (మగవారు) మరణిస్తే స్పౌజ్ కేటగిరి కింద భార్యకు పింఛన్‌ను వర్తింపజేస్తున్నట్లు పేర్కొన్నారు. చాలామంది కొత్త పింఛన్ల కోసం సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చి అర్జీలు అందజేస్తున్నారన్నారు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాగానే పత్రికా ప్రకటనలు ఇస్తామని, తెలిపారు. సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే చాలని, జిల్లా కేంద్రానికి వచ్చి అర్జీలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
యూత్ ఏషియన్ క్రీడాకారునికి అభినందన


