జీపుతో ఢీకొట్టి.. కొడవళ్లతో దాడి చేసి!
గుత్తి రూరల్: మండలంలోని నేమతాబాదు గ్రామానికి చెందిన సుబ్బారెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు కొడవళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పోలీసులు తెలిపిన మేరకు.. వ్యక్తిగత పనిపై సుబ్బారెడ్డి సోమవారం రాత్రి గుత్తికి వచ్చాడు. పనిముగించుకుని ద్విచక్రవాహనంపై వెళుతుండగా స్వగ్రామం శివారుకు చేరుకోగానే గుర్తు తెలియని వ్యక్తులు జీపుతో ఢీకొన్నారు. బైక్ నుంచి ఎగిరి రోడ్డుపై పడిన సుబ్బారెడ్డిపై కర్రలు, ఇనుపరాడ్లు, కొడవళ్లతో దాడి చేసి ఉడాయించారు. రక్తపు మడుగులో పడి ఉన్న సుబ్బారెడ్డిని అటుగా వెళుతున్న స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు వెంటనే గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. కాగా, సుబ్బారెడ్డికి సమీప బంధువులతో కొన్నేళ్లుగా ఆస్తి గొడవలు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థులు దాడి చేసినట్లుగా సమాచారం. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


