పాపంపేట భూముల అక్రమాల్లో తొలి వికెట్ డౌన్
రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం పాపంపేట శోత్రియం భూముల అక్రమాల వ్యవహారంలో తొలి వికెట్ పడింది. గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్‌ఓ) గొల్ల రఘుయాదవ్‌పై సస్పెన్షన్ వేటు వేస్తూ కలెక్టర్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ కొనసాగుతోందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈయన ప్రస్తుతం రుద్రంపేట–2 సచివాయలంలో వీఆర్‌ఓగా పని చేస్తున్నారు. పాపంపేట శోత్రియం భూములకు సంబంధించి 27–ఏ, 27–1, 27–3 సర్వే నంబర్లలో 22.96 ఎకరాలు రాచూరి వెంకట కిరణ్, రాచూరి సుబ్రహ్మణ్యం హక్కులో ఉన్నారంటూ 2024 ఆగస్టు 13న అప్పటి పాపంపేట వీఆర్‌ఓ గొల్ల రఘుయాదవ్ ధ్రువీకరిస్తూ పత్రాలు జారీ చేశారు. వీటి ఆధారంగా రాచూరి వెంకటకిరణ్, రాచూరి సుబ్రమణ్యం ఇద్దరూ దుర్వినియోగానికి పాల్పడ్డారు. మ్యుటేషన్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయా భూముల్లో ఏళ్లతరబడి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారిలో తీవ్ర గందరగోళం నెలకొంది. అధికారం లేకపోయినా సంబంధం లేని భూములకు హక్కులు కల్పిస్తూ ధ్రువీకరించారని ఆర్డీఓ విచారణలో తేలింది. నిర్లక్ష్యం, అజాగ్రత్తగా వ్యవహరించిన వీఆర్‌ఓపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్డీఓ సిఫార్సు చేశారు. క్రమశిక్షణ చర్యలు ముగిసేదాకా సస్పెన్షన్‌లోనే ఉంటారు. కలెక్టర్ అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయం వదలి వెళ్లకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
మండల సర్వేయర్ పాత్రా కీలకమే..
ఈ అక్రమాల్లో మండల సర్వేయర్ రఘునాథ్ పాత్ర కూడా కీలకంగా ఉంది. ఏకంగా 175 ఎకరాలకు పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చారు. పైగా ఇవన్నీ వ్యవసాయ భూములుగా నిర్ధారిస్తూ ధ్రువీకరణపత్రాలు ఇచ్చారు. భూ సర్వే అధికారుల విచారణలో ఇవన్నీ వెలుగు చూశాయి. పూర్తిస్థాయి నివేదికను కలెక్టర్‌కు అందజేశారు. చర్యలు తీసుకోవాలంటూ డైరెక్టరేట్‌కు సిఫార్సు చేశారు. ఈ వ్యవహారంలో పూర్వ సర్వేయర్ ప్రతాప్‌రెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ డైరెక్టర్‌కు నివేదించారు. అతి త్వరలోనే వీరిపైనా చర్యలుంటాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.


