రచ్చకెక్కిన ‘తమ్ముళ్ల’ కబ్జా
అనంతపురం ఎడ్యుకేషన్: నగరంలోని శారదానగర్ పరిధిలో నివాసముంటున్న విశ్రాంత అధ్యాపకురాలి ఇంటి కబ్జా వెనుక టీడీపీ నేతలు ఉన్నారంటూ అదే పార్టీకి చెందిన కార్పొరేటర్ హరిత, ఆమె భర్త జయరాంనాయుడు ఆరోపిస్తూ మంగళవారం సదరు ఇంటి ఎదుట ధర్నా చేపట్టారు. వాస్తవానికి ఆ ఇంటి కబ్జా వెనుక జయరాంనాయుడు ఉన్నాడనే ఆరోపణలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో వారు ధర్నాకు దిగి టీడీపీ నేతలపైనే ఆరోపణలు చేశారు. తమ పార్టీ వారే ఈ ఇంటిని కబ్జా చేయాలని చూస్తున్నారని, ఇందులో తమకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. ఇది చూసిన పలువురు శారదానగర్ లాంటి ఘటనలు చాలాచోట్ల ఉన్నాయని అధికారాన్ని అడ్డుపెట్టుకుని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు.
కోత మిషన్‌లో పడి యువకుడి మృతి
డి.హీరేహాళ్(బొమ్మనహాళ్): కోత మిషన్‌లో పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన డి.హీరేహాళ్ మండలం గొడిసెలపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చిన్నరాజు (25) గ్రామ సమీపంలోని కంది పొలంలో మిషన్ ద్వారా కోత కొస్తుండగా ప్రమాదవశాత్తు అందులో పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం గ్రామంలోని ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారణ అయింది.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కేసు
యల్లనూరు: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ఈ నెల 21 పొట్టేలు నరికిన 8 మందిపై యల్లనూరు పోలీసులు సోమవారం రాత్రి కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం యల్లనూరుకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు మారుతీ, శివ, మహేష్, పెద్దిరాజు, నరేష్, రాము, పెద్దన్న, రమణను స్టేషన్‌కు తీసుకువెళ్లారు. సాయంత్రం వరకూ స్టేషన్‌లో కూర్చోబెట్టి అనంతరం యల్లనూరు ప్రాథమిక కేంద్రంలో వారికి వైద్య పరీక్షల నిర్వహించారు. అనంతరం జడ్జి ముందు ప్రవేశపెట్టారు. కాగా, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అభిమానంతో తాము వేడుకలు చేసుకుంటే ఎవరికేం నష్టం జరిగిందని బాధితులు ప్రశ్నించారు. ఇక వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం అన్యాయమని వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి సాకే శైలజానాధ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భోగతి విజయ ప్రతాప్‌రెడ్డి, జిల్లా పార్టీ కార్యదర్శి విష్ణునారాయణ, మండల కన్వీనరు శివశంకర్ మండిపడ్డారు.
హెచ్చెల్సీలో వివాహిత గల్లంతు
బొమ్మనహాళ్: ప్రమాదవశాత్తు హెచ్చెల్సీలో పడి ఓ వివాహిత గల్లంతైంది. పోలీసులు తెలిపిన మేరకు... బొమ్మనహాళ్ మండలం మైలాపురం గ్రామానికి చెందిన దంపతులు వరలక్ష్మి(25), నవీన్ మంగళవారం సాయంత్రం కర్ణాటకలోని రాంపురంలో సంతకు వెళ్లి రాత్రికి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు. గ్రామ సమీపంలోని హెచ్చెల్సీ వద్దకు చేరుకోగానే ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడడంతో వెనుక కూర్చొన్న వరలక్ష్మి కాలువలోకి పడి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. కాగా, ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. గల్లంతైన వరలక్ష్మి కోసం బంధువులు, స్ధానికులు, పోలీసులు హెచ్చెల్సీ గాలింపు చర్యలు చేపట్టారు.
‘బీమా సంకల్ప్’ మెగా డ్రైవ్‌లో అనంతకు మూడోస్థానం
అనంతపురం సిటీ: తపాలా శాఖ చేపట్టిన ‘బీమా సంకల్ప్ 2.0’ కార్యక్రమం కింద పీఎల్‌ఐ/ఆర్‌పీఎల్‌ఐ మెగా డ్రైవ్‌లో అనంతపురం డివిజన్ రాష్ట్ర స్థాయిలో మూడో స్థానం సాధించినట్లు ఆ శాఖ సూపరింటెండెంట్ కోనేటి అమరనాథ్ తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. నూతన ప్రీమియం కింద రూ.1.84 కోట్లు సేకరించినట్లు వివరించారు. తక్కువ ప్రీమియం, అధిక బోనస్, మనీ బ్యాక్ సేవింగ్స్ పాలసీలు, పీఎల్‌ఐ జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు డిగ్రీ, డిప్లొమో, ఐటీఐ, ప్రైవేటు ఉద్యోగులను తమ స్కీమ్‌లు విశేషంగా ఆకర్షించాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పీఎల్‌ఐ, ఆర్‌పీఎల్‌ఐ పాలసీలు అత్యంత సురక్షితంగాను, విశ్వసనీయంగా ఉండడంతో పెట్టుబడి పెట్టేందుకు చాలామంది ముందుకు వస్తున్నారని తెలిపారు. తమ శాఖలోని అన్ని విభాగాల సిబ్బంది మొదలు అధికారుల వరకు ప్రతి ఒక్కరూ సహకరించడం వల్లే ఈ విజయం సాధ్యమైందని, ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
రచ్చకెక్కిన ‘తమ్ముళ్ల’ కబ్జా


