
యాడికి: వేరు కాపురం పెట్టే వరకూ తాను రానంటూ పుట్టింటికి వెళ్లిన భార్య తెగేసి చెప్పడంతో జీవితంపై విరక్తిచెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... యాడికి మండలం కూర్మాజీపేటకు చెందిన గంగరాజు, కృష్ణవేణి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు విజయ్ (24)కు పామిడి మండలం గజరాంపల్లికి చెందిన పూజితతో ఏడు నెలల క్రితం వివాహమైంది. ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భిణి. ఈ క్రమంలో నిద్ర చేసేందుకని పూజితను తల్లిదండ్రులు నెల రోజుల క్రితం ఇంటికి పిలుచుకెళ్లారు. ఆ తర్వాత ఆమెను పిలుచుకొచ్చేందుకు విజయ్ వెళ్లాడు.
అయితే వేరు కాపురం పెట్టాలని, అప్పటి వరకూ తాను రానని పూజిత తెలపడంతో నచ్చచెప్పేందుకు ప్రయ త్నించాడు. ఆమె ససేమిరా అనడంతో స్వగ్రామానికి ఒంటరిగానే చేరుకున్నాడు. ఈ క్రమంలోనే ముభావంగా ఉంటూ వచ్చిన కుమారుడిని చూసిన తల్లిదండ్రులు పదేపదే ప్రశ్నిస్తున్నా... సమాధానం చెప్పలేక సతమతమయ్యాడు. చివరకు తన భార్య లేవనెత్తిన వేరు కాపురం అంశాన్ని శుక్రవారం రాత్రి తల్లిదండ్రులతో చెప్పుకుని కుమిలిపోయాడు. దీంతో తల్లిదండ్రులు సముదాయించి వేరు కాపురం పెట్టేందుకు సమ్మతించారు.
భోజనం ముగించుకుని బెడ్‌రూంలోకి వెళ్లిన విజయ్.. శనివారం ఉదయమైనా తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు ఇంటి వెనుక ఉన్న కిటికీ తలుపులు తీసి చూశారు. అప్పటికే ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని విగతజీవిగా వేలాడుతున్న విజయ్‌ను చూసి బోరున విలపించారు. విషయం తెలుసుకున్న బంధువులు అక్కడకు చేరుకుని బెడ్‌రూం తలుపులు బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించి విజయ్ మృతదేహాన్ని కిందకు దించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ గురుప్రసాదరెడ్డి కూర్మాజీపేట గ్రామానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. గంగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, భర్త మృతితో కూర్మాజీపేటకు చేరుకున్న భార్య పూజిత విజయ్ మృతదేహంపై పడి రోదించిన తీరు అందరినీ కంట తడి పెట్టించింది.