చరణ్‌కుమార్, రఫీ, శ్రీరాములు
గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి
ద్వారకా తిరుమల నుంచి భీమడోలు వెళ్లేదారిలో ప్రమాదం
భీమడోలు: ఆ యువకులు ముగ్గురూ మంచి స్నేహితులు.. ముగ్గురూ కలిసి శుభకార్యాలకు ఫ్లవర్ డెకరేషన్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పనిలో భాగంగా ముగ్గురూ కలిసే వెళ్తారు. శనివారం తెల్లవారుజామున డెకరేషన్ పుష్పాల కోసం వెళ్లి బైక్‌పై తిరిగి వస్తున్న వారిని ఏలూరు జిల్లా భీమడోలు వద్ద జాతీయ రహదారిపై ఓ గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయారు.
ఏలూరు నుంచి పొలసానిపల్లి వైపుగా ముగ్గురు యువకులు కలిసి వెళ్తుండగా వీరి బైక్ భీమడోలు వద్ద ప్రమాదానికి గురై ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. వీరిలో ద్వారకాతిరుమల మండలం తిమ్మపురానికి చెందిన మాండ్రోజు చరణ్‌కుమార్ (26), ద్వారకాతిరుమల గ్రామానికి చెందిన సయ్యద్ రఫీ (22), కొయ్యగర శ్రీరాములు అలియాస్ బన్నీ (21) ఉన్నారు.
ఘటనాస్థలంలో నెత్తుటి మడుగులో ఉన్న బిడ్డలను చూసి కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. భీమడోలు సీఐ యూజే విల్సన్, ఎస్‌ఐ ఎస్‌కే మదీనా బాషా ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
దట్టమైన పొగమంచే కారణమా ?
ద్వారకాతిరుమలలో ఆదివారం జరిగే ఓ ఫంక్షన్‌కు డెకరేషన్ కోసం పువ్వుల కొనుగోలుకు చరణ్‌కుమార్ తన తమ్ముడి కొత్త బైక్‌పై రఫీ, బన్నీతో కలిసి శుక్రవారం రాత్రి బయలుదేరి వెళ్లాడు. ఏలూరులో ఫ్లవర్స్ ఆర్డర్ ఇచ్చి తిరిగి వస్తున్న వీరు భీమడోలు ఫ్లైఓవర్ సమీపంలో చనిపోయారు. దట్టమైన పొగమంచు కురుస్తుండడం కూడా ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భీమడోలు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


