
అనంతపురం కల్చరల్: చీకటిపై వెలుగు విజయమే దీపావళి. దుష్ట శక్తులను పారదోలి కొంగొత్త జీవితానికి స్వాగతం పలికే పండుగకు జిల్లావాసులు సిద్ధమయ్యారు. అప్పుడే ప్రతి ఇంటా దీపావళి శోభ సంతరించుకుంది. ఆదివారం జిల్లా అంతటా టపాసుల మోత మోగనుంది. ఇప్పటికే బాణాసంచా కొనుగోళ్లతో పాటు కొత్త వస్తువులను పండుగ రోజు కొనడానికి ఆసక్తి కనపరుస్తుండడంతో వస్త్ర, సెల్‌ఫోన్, ఎలక్ట్రానిక్ దుకాణాలు కిటకిటలాడుతున్నాయి.
లక్ష్మీదేవికి స్వాగతం
సకల శుభాలు, సంపదలు ప్రసాదించే లక్ష్మీదేవిని దీపావళి రోజున ప్రత్యేకంగా ఆరాధించడం సంప్రదాయం. ఈ పర్వదినాన సాక్షాత్తు మహాలక్ష్మి భూలోకానికి వచ్చి ఇల్లిల్లూ తిరుగుతుందని అందరి నమ్మకం. అందు కోసమే ప్రతి ఇంటా దీపకాంతులు తేజోమయమై లక్ష్మీదేవిని ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేస్తారు. జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాలతో పాటు వైష్ణవాలయాలు ప్రత్యేక లక్ష్మీపూజలకు సిద్ధమయ్యాయి.
అనంతపురం క్రైం: దీపావళి పండుగను ఎస్పీ అన్బురాజన్ వినూత్నంగా జరుపుకొన్నారు. పండుగను పురస్కరించుకుని శనివారం అనంతపురంలోని ఎన్టీఆర్ కాలనీలోని షికారి పిల్లలను తన చాంబర్‌కు రప్పించారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న 60 మంది పిల్లలతో ఎస్పీ ముచ్చటించారు. చదువుకుని ఏమవుతారని ప్రశ్నించగా.. కొందరు కలెక్టర్, మరికొందరు పోలీస్, ఆర్మీ, ఇంకొందరు డాక్టర్ తదితర అధికారులవుతామని చెప్పారు. అనంతరం పిల్లలందరికీ నూతన వస్త్రాలతో పాటు స్వీట్లు, టపాసుల బాక్సులు అందజేసి దీపావళి సంబరాలు చేసుకున్నారు. అభం శుభం తెలియని వయసులో దీపావళి అనగానే మరింత ఉత్తేజంతో ఆడుకునే పిల్లల మధ్య సంబరాలు జరుపుకోవడం ఆనందంగా ఉందని ఎస్పీ అన్నారు. తనకు ఇదే నిజమైన దీపావళి అని వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఆర్.విజయభాస్కర్‌రెడ్డి, డీసీఆర్బీ సీఐ విశ్వనాథచౌదరి తదితరులు పాల్గొన్నారు.

అనంతపురం శ్రీనగర్‌కాలనీ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలో టపాసుల విక్రయాలు

దీపావళి గిఫ్ట్ ప్యాక్ అందుకున్న చిన్నారులతో ఎస్పీ అన్బురాజన్