ఇక ‘సింగిల్‌ స్పెషల్‌ డిగ్రీ’ | - | Sakshi
Sakshi News home page

ఇక ‘సింగిల్‌ స్పెషల్‌ డిగ్రీ’

Sep 16 2023 12:16 AM | Updated on Sep 16 2023 10:52 AM

- - Sakshi

అనంతపురం: విద్యా ప్రమాణాల పెంపునకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తాజాగా అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ)లో సింగిల్‌ సబ్జెక్టు మేజర్‌గా నూతన విద్యా ప్రణాళిక(కర్రిక్యులమ్‌)ను ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకూ యూజీలో మూడు సబ్జెక్టుల ప్రధాన కాంబినేషన్‌తో విద్యాబోధన సాగుతుండగా ఇకపై మేజర్‌ సబ్జెక్టు ఒక్కటే ప్రధానంగా డిగ్రీ విద్య కొనసాగనుంది. 2023–24 విద్యా సంవత్సరం నుంచే డిగ్రీ మొదటి సంవత్సరం 1, 2 సెమిస్టర్లలో ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. గతంలో బీఎస్సీ ఎంపీసీలో మూడు సబ్జెక్టుల కాంబినేషన్‌ ఉండగా, వాటి స్థానంలో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీలో ఏదో ఒక సబ్జెక్టును మేజర్‌గా ఎంపిక చేసుకుని డిగ్రీలో అడ్మిషన్‌ పొందవచ్చు.

రెండో సెమిస్టర్‌లో దాదాపు 100 కోర్సుల నుంచి విద్యార్థులు తమకు నచ్చిన విభాగంలో మైనర్‌ సబ్జెక్టును ఎంపిక చేసుకునే వెసులు బాటు కల్పించారు. తద్వారా మేజర్‌, మైనర్‌ సబ్జెక్టుల్లో ఏదో ఒక దానితో పీజీ విద్యను పూర్తి చేసేలా సమూల మార్పులు చేశారు. ఇందుకు సంబంధించిన విద్యా ప్రణాళికను మార్పు చేస్తూ శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం యూజీ బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్లు నూతన సిలబస్‌కు రూపకల్పన చేశారు. డిగ్రీలో ఏదైనా ఒక సబ్జెక్టులో విద్యార్థులు సంపూర్ణ నైపుణ్యాలను సాధించే దిశగా ఈ విద్యాప్రణాళిక ఉండడం గమనార్హం. త్వరలో ఈ నూతన సిలబస్‌ను అకడమిక్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌లో పెట్టి ఆమోదింపజేయనున్నారు.

బీఎస్సీ, బీఏ, బీకామ్‌లో అమలు:
డిగ్రీలో మేజర్‌ సబ్జెక్టుతో పాటు కచ్చితంగా ఒక మైనర్‌ సబ్జెక్టు చదవాలనే నిబంధన పెట్టారు. ఉదాహరణకు ఒక సైన్స్‌ విద్యార్థి మైనర్‌ సబ్జెక్టుగా ఆర్థిక శాస్త్రం, చరిత్ర, సంగీతం, యోగా, డేటా సైన్స్‌ , మార్కెటింగ్‌.. ఇలా ఇతర సబ్జెక్టులను ఎంపిక చేసుకోవచ్చు. ఆర్ట్స్‌ విద్యార్థులు మైనర్‌లో (ఇంటర్మీడియట్‌ కోర్సుల ఆధారంగా) నచ్చిన సబ్జెక్టు తీసుకోవచ్చు. కొత్త విధానాన్ని బీఎస్సీతో పాటు బీఏ, బీకామ్‌ డిగ్రీలో అమలు చేయనున్నారు. డిగ్రీ విద్యలో ఉద్యోగ అవకాశాలను పెంపొందించడంతో పాటు ఇంజినీరింగ్‌తో సమానంగా తీర్చిదిద్దేందుకు ఈ విద్యా సంస్కరణలు దోహదం కానున్నాయి. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ కోర్సుల్లో ఇప్పటికే తొలి దఫా అడ్మిషన్లు పూర్తయ్యాయి. కొత్త విధానంపై డిగ్రీలో చేరే విద్యార్థులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించి అడ్మిషన్‌ కల్పించారు.

నాలుగో ఏడాది డిగ్రీకి అనుమతి:
ఇప్పటి వరకూ మూడో ఏడాది డిగ్రీ విద్య పూర్తయ్యేది. నూతన జాతీయ విద్యావిధానం–2020 అమలులో భాగంగా దేశంలో తొలిసారిగా విద్యా సంస్కరణలను ఏపీలోనే అమలు చేస్తున్నారు. ఈ విధానం ద్వారా నాలుగేళ్ల ఆనర్స్‌ డిగ్రీని అందుబాటులోకి తీసుకువచ్చారు. యూజీసీ ఫ్రేమ్‌ వర్క్స్‌ ప్రకారం డిగ్రీని రెండు విధాలుగా విభజించారు. మూడేళ్ల డిగ్రీలో 75 శాతం మార్కులు సాధించిన వారు రీసెర్చ్‌ ఆనర్స్‌ డిగ్రీ కోర్సులో చేరవచ్చు. ఇది పూర్తి చేసిన వారు పీజీ లేకుండా నేరుగా పీహెచ్‌డీకి అర్హత సాధిస్తారు. మూడేళ్ల కోర్సులో ఉత్తీర్ణులైతే జనరల్‌ ఆనర్స్‌ కోర్సుగా పరిగణిస్తారు. ఇది పూర్తి చేసిన వారు పీజీలో రెండో ఏడాదిలో చేరవచ్చు. ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో ఆనర్స్‌ కోర్సుల అమలుకు గత మూడేళ్లలో వరుసగా 30 శాతం అడ్మిషన్లతో పాటు సంబంధిత కోర్సుల్లో ఇద్దరు డాక్టరేట్‌ కలిగిన ప్రొఫెసర్లు ఉంటేనే అనుమతి మంజూరు చేస్తున్నారు.

సింగిల్‌ సబ్జెక్టుపై ప్రధాన దృష్టి
రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ కోర్సులో సమూల మార్పులు తీసుకొచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచే సింగిల్‌ సబ్జెక్టు స్పెషల్‌ డిగ్రీ విధానం అమల్లోకి వచ్చింది. ఒక సబ్జెక్టుపై పూర్తి స్థాయి పట్టు సాధించడంతో పాటు, ఇతర సబ్జెక్టుల్లోనూ అవగాహన పెంపొందేలా నూతన విద్యా ప్రణాళికకు రూపకల్పన చేశారు. ఇప్పటికే నూతన విద్యా ప్రణాళికను ఉన్నత విద్యా మండలి పూర్తి చేసింది. ఈ అంశాలను బోర్డ్‌ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్ల సమావేశంలో ఆమోదించారు. త్వరలో అకడమిక్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌ ఆమోదం పొందిన తర్వాత కొత్త సిలబస్‌ అమల్లోకి వస్తుంది.

– ప్రొఫెసర్‌ కె.రాంగోపాల్‌,సీడీసీ డీన్‌, ఎస్కేయూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement