మొదలైన ‘చీనీ’ సీజన్
అనంతపురం అగ్రికల్చర్: చీనీ సీజన్ ప్రారంభమైంది. అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డుకు సరుకు రావడం ఇప్పుడిప్పుడే మొదలైంది. గత అక్టోబర్ నుంచి జనవరి వరకు దాదాపు నాలుగు నెలల పాటు నామమాత్రపు అమ్మకాలు జరిగాయి. ఈ కాలంలో రోజుకు 100 టన్నులు కూడా క్రయ విక్రయాలు జరగలేదు. సాధారణంగా ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ వరకు మార్కెట్ జోరుగా ఉంటుంది. దీంతో ఈ సీజన్ మొదలు కావడంతో ఈ నెల నుంచి మార్కెట్‌కు సరుకు పెరుగుతూ వస్తోంది. బుధవారం మార్కెట్‌లో 500 టన్నుల వరకు అమ్మకాలు జరిగాయి. ఇక నుంచి మరింత పెరిగే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. ఇక మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రోజుకు 1,500 టన్నుల దాకా క్రయ విక్రయాలు జరగవచ్చని అంచనా వేస్తున్నారు.
గిట్టుబాటు ధర కోసం ఎదురుచూపు
చీనీ ధరలు గత ఏడాది నేలచూపు చూడటంతో రైతులు నష్టాలు మూటగట్టుకున్నారు. మార్చి, ఏప్రిల్ మినహా మిగతా నెలల్లో గరిష్ట ధర రూ.20 వేలకు మించి పలకలేదు. ఇప్పుడు సీజన్ ఆరంభంలో గరిష్ట ధర రూ.24 వేలతో నడుస్తోంది. వేసవిలో ఈసారి చీనీకి మంచి ధరలు పలికే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో 37 వేల హెక్టార్ల భారీ విస్తీర్ణంలో చీనీ తోటలు విస్తరించగా.. 7.50 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఫలసాయం వస్తుందని చెబుతున్నారు. ఇక్కడ పండుతున్న చీనీలో 60 శాతం వరకు రాజస్తాన్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలతో పాటు హైదరాబాద్, చైన్నె, బెంగళూరుకు చెందిన వ్యాపారులు కొందరు నేరుగా, మరికొందరు తమ ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేస్తుంటారు. మార్కెట్ యార్డులో గ్రేడ్–ఏతో పాటు బీ, సీ గ్రేడ్ చీనీ అమ్మకాలు జరుగుతున్నందున ఉత్తరాది నుంచి వచ్చే పెద్ద పెద్ద వ్యాపారులతో పాటు లోకల్ వ్యాపారులు కూడా ఆసక్తి చూపిస్తుంటారు. గతేడాది నష్టాల నుంచి గట్టెక్కడానికి మంచి గిట్టుబాటు ధర కోసం ‘అనంత’ చీనీ రైతులు ఎదురుచూస్తున్నారు.
మార్కెట్ యార్డులో చీనీ క్రయ విక్రయాలు


