పెన్నహోబిలంలో మట్టి తోడేళ్లు
● లక్ష్మీనృసింహుని ఆలయం చుట్టూ తవ్వకాలు
● జేసీబీతో తవ్వి.. ట్రాక్టర్ల ద్వారా తరలించి అమ్ముకుంటున్న వైనం
ఉరవకొండ: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలోని ప్రముఖ పర్యాటక – పుణ్యక్షేత్రం పెన్నహోబిలంలో సహజ వనరులపై అక్రమార్కులు కన్నేశారు. ఆలయ పరిధిలోని భూముల్లో మట్టిని యథేచ్ఛగా తవ్వకాలు చేపట్టి సొమ్ము చేసుకుంటున్నారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ఇక్కడ ఏటా మే నెలలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇక్కడ ఉత్సవాల సమయంలో ఆలయ పరిసరాలు– చుట్టుపక్కల ఆరుబయలు ప్రాంతాల్లో టెంట్లు వేసుకుని ఇక్కడే వంటావార్పు చేసుకుంటుంటారు. కొందరు భక్తులు వారి ఆర్థిక స్థోమతను బట్టి వసతి కోసం సత్రాలు/ భవనాలు , బేస్‌మెంట్లు నిర్మించారు. అలాంటి ఈ పుణ్యక్షేత్ర పరిసరాల్లోని ఆరుబయలులో మట్టితో పాటు వివిధ రకాల చెట్లు ఉన్నాయి. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కొందరు అక్రమార్కులు సహజ వనరులను సొంత ఆదాయమార్గంగా మార్చుకున్నారు. ఇప్పటికే ఉరవకొండ, వజ్రకరూరు ప్రాంతాల్లోని హంద్రీ–నీవా కాలువ గట్ల మట్టిని దోచేసి రూ.కోట్లు గడించారు. తాజాగా వీరి కన్ను పెన్నహోబిలంపై పడింది. ఇక్కడ ఆరుబయలులోని ఎర్రమట్టిని జేసీబీలు పెట్టి తవ్వేస్తున్నారు. ట్రాక్టర్ మట్టి రూ.1000 దాకా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మూడు వారాలుగా మట్టిని తోడేస్తుండటంతో పెద్ద పెద్ద గోతులు కనిపిస్తున్నాయి. అక్రమార్కులకు టీడీపీ నేతల అండ దండలు ఉండటంతో రెచ్చిపోతున్నారని తెలుస్తోంది.
దేవదాయ శాఖ నిర్లక్ష్యం
పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ఆలనా పాలనా గాలిలో దీపంలా మారింది. ఇక్కడ రెగ్యులర్ కార్య నిర్వహణ అధికారి (ఈఓ) లేరు. దీంతో ఆలయ నిర్వహణ – సిబ్బంది పర్యవేక్షణ గాడితప్పింది. దేవదాయ శాఖ ప్రస్తుతానికి ఇన్‌చార్జ్ అధికారిని నియమించి చేతులు దులుపుకొంది. ఈ నేపథ్యంలో ఆలయం చుట్టుపక్కల ఏమి జరుగుతోందో పట్టించుకునేవారు లేరు. మట్టి తవ్వుకుపోతున్నా.. పచ్చని చెట్లు నేల కూలుస్తూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నా తమకు సంబంధం లేదన్నట్టుగా ఉంటున్నారు.
పెన్నహోబిలంలో ఆలయ దిగువన ఆమిద్యాల మార్గంలో అక్రమంగా మట్టి తవ్వకాలు
పెన్నహోబిలంలో మట్టి తోడేళ్లు


