ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై రేపు ధర్నా
అనంతపురం ఎడ్యుకేషన్: మేనిఫెస్టో సాక్షిగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) ఆధ్వర్యంలో ఈ నెల 13న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు. బుధవారం సాయంత్రం స్థానిక సంఘం జిల్లా కార్యాలయంలో ఎస్టీయూ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు నీలూరి రమణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరి 20 నెలలు కావస్తున్నా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన ఎన్నికల హామీలను ఇంతవరకు నెరవేర్చకపోవడం దారుణమన్నారు. మెరుగైన పీఆర్సీ ఇస్తామని నమ్మించి రెండున్నరేళ్లు ఆలస్యమవుతున్నా కనీసం కమిటీ కూడా వేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. సకాలంలో పీఆర్సీ ఇవ్వకపోవడంతో ప్రతి ఉద్యోగీ ఆర్థికంగా చాలా నష్టపోతున్నారన్నారు. నష్ట నివారణ చర్యలో భాగంగా మధ్యంతర భృతి ప్రకటించకపోవడం అన్యాయమన్నారు. రిటైర్డు ఉద్యోగులకు అందాల్సిన సౌలభ్యాలు నెలల తరబడి ఆలస్యం అవుతున్నాయన్నారు. డిమాండ్ల సాధన కోసం శుక్రవారం తలపెట్టిన ధర్నా విజయవంతం చేయాలని రమణారెడ్డి పిలుపునిచ్చారు. సమావేశంలో ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కమిటీ మెంబర్ వి.రాజశేఖర్, జిల్లా గౌరవాధ్యక్షుడు శివయ్య చారి, జిల్లా ఆర్థిక కార్యదర్శి జి.మల్లికార్జున, రాష్ట్ర కౌన్సిలర్ కె.కృష్ణమోహన్, జిల్లా ఉపాధ్యక్షుడు నాగభూషణ, నాయకులు వై.రవి, నిట్టూరు చంద్రశేఖరరావు, రామకృష్ణ, శ్రీనివాసులు, మహేష్‌రెడ్డి పాల్గొన్నారు.
తాగునీటి సమస్యలపై
కమాండ్ కంట్రోల్ సెంటర్
● 97017 45437కు ఫోన్ ద్వారా ఫిర్యాదు
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో తాగునీటి సమస్యల పరిష్కారం కోసం జిల్లా పంచాయతీ కార్యాలయం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి టి.నాగరాజనాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా సంబంధిత సమస్యలు ఎదురైతే ప్రజలు ఫోన్ ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. అందిన ఫిర్యాదులను తక్షణమే సంబంధిత అధికారులకు తెలియజేసి వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బి.మదన్‌మోహన్ 97017 45437 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చని డీపీఓ స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.


