దేవుళ్ల పేరుతో రాజకీయమా..? | - | Sakshi
Sakshi News home page

దేవుళ్ల పేరుతో రాజకీయమా..?

Feb 12 2026 7:24 AM | Updated on Feb 12 2026 7:24 AM

దేవుళ్ల పేరుతో రాజకీయమా..?

దేవుళ్ల పేరుతో రాజకీయమా..?

ఉరవకొండ: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక దేవుళ్లను వాడుకునే నీచ సంస్కృతికి ముఖ్యమంత్రి చంద్రబాబు దిగజారారని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇరుముడితో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లిన శివమాలధారులపై పోలీసులు లాఠీ చార్జ్‌ చేయడం దారుణమన్నారు. ఆలయాల నిర్వహణ, భక్తుల భద్రత విషయంలో చంద్రబాబు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వానికి ముందు చూపులేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. గతంలో తిరుమల, సింహాచలం తొక్కిసలాటలో తొమ్మిది మంది మృతి చెందినా, శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తొక్కిసలాటలో మరో పది మంది భక్తులు చనిపోయినా ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోలేదన్నారు. శ్రీశైలంలోనూ పొరపాటున అలాంటి ఘోర ఘటనలు జరిగి ఉంటే ప్రభుత్వం బాధ్యత వహించేదా అని ప్రశ్నించారు.

భక్తుల మనోభావాలు పట్టని బాబు అండ్‌ కో

భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నా రాజకీయ స్వార్థమే తమకు ముఖ్యం అన్నట్టుగా చంద్రబాబు అండ్‌ కో వ్యవహరిస్తోందని విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని సిట్‌ నివేదిక ఇచ్చినా.. దుష్ప్రచారం చేసినందుకు పశ్చాత్తాపం చెందకుండా మరింత దిగజారుడుగా వ్యవహరించారన్నారు. సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు కేబినెట్‌ మొత్తం ప్రెస్‌మీట్‌ పెట్టి లడ్డూ ప్రసాదం అంశంలో సిట్‌ నివేదిక ఇచ్చిన అంశంపై ఏకసభ్య కమిటీతో విచారణ చేయిస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఇక శ్రీశైలం మల్లన్న లడ్డూ ప్రసాదం తయారీలోనూ బాత్‌రూంలు కడిగే ద్రావణం కలిపారని చేసిన ప్రకటన భక్తులు నిర్ఘాంతపోయేలా చేసిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ఈ విషప్రచారాన్ని కోట్లాది మంది భక్తులు చీదరించుకుంటున్నారన్నారు.

తిమ్మిని బమ్మిని చేసే ఘనుడు కేశవ్‌

ఉరవకొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ తిమ్మిని బమ్మిని చేసి పచ్చి అబద్దాలు చెప్పడంలో ఘనుడని విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌తో పాటు ప్రభుత్వం తప్పులు ఎప్పుడు బయటపడ్డా ప్రెస్‌మీట్‌ల ద్వారా పచ్చి అబద్ధాలు వల్లెవేయడం కేశవ్‌కు పరిపాటిగా మారిందన్నారు. ముఖ్యంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో మాట్లాడి అభాసుపాలయ్యారన్నారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ వ్యవహారంలోనూ జీఓలను వక్రీకరిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్తులూరు అశోక్‌, జిల్లా అధికార ప్రతిని సీపీ వీరన్న, ఎంపీపీ నరసింహులు, వైస్‌ ఎంపీపీ ఈడిగ ప్రసాద్‌, రాష్ట్ర నాయకులు బసవరాజు, రూరల్‌, మండల సమన్వయకర్తలు ఎర్రిస్వామిరెడ్డి, ఓబన్న, పరిశీలకులు డిష్‌ సురేష్‌, వజ్రకరూరు కన్వీనర్‌ సోమశేఖర్‌రెడ్డి, చాబాల జగదీష్‌, నాయకులు పచ్చి రవి, చిన్న భీమా, మారెష్‌, వడ్డే ఆంజినేయులు, మహనంది తదితరులు పాల్గొన్నారు.

శ్రీశైలంలో శివభక్తులపై లాఠీచార్జ్‌ చేయడం దారుణం

భక్తులకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలం

వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement