గర్జించిన యువత | - | Sakshi
Sakshi News home page

గర్జించిన యువత

Aug 11 2026 1:06 AM | Updated on Aug 11 2026 1:06 AM

నిర్బంధాలను అధిగమించి

మెగా డీఎస్సీ అక్రమాలపై కదంతొక్కిన యువత, విద్యార్థులు

చోడవరం : చోడవరంలో భారీ ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి

అమర్‌నాథ్‌, యువజన, విద్యార్థి విభాగాల నాయకులు

నర్సీపట్నం : నిరసన ర్యాలీని అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే గణేష్‌, పార్టీ నాయకులు, యువత

యలమంచిలి రూరల్‌ : యలమంచిలిలో ర్యాలీ చేస్తున్న వైఎస్సార్‌సీపీ

సమన్వయకర్త ధర్మశ్రీ, పార్టీ నాయకులు, యువజన, విద్యార్థి నాయకులు

పాయరావుపేట : పాయకరావుపేటలో ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కంబాల జోగులు, పార్టీ నాయకులు, యువజన నాయకులు

సాక్షి, అనకాపల్లి: : మెగా డీఎస్సీ అక్రమాలపై జిల్లా వ్యాప్తంగా యువత, విద్యార్థులు కదంతొక్కారు. వైఎస్సార్‌ సీపీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో తలపెట్టిన నిరసన ర్యాలీలకు విశేష స్పందన లభించింది. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నప్పటికీ అడుగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. పలు చోట్ల ముందస్తు నోటీసులు జారీ చేస్తూ, అరెస్టులు చేస్తామని బెదిరింపులకు దిగారు. అయితే, పోలీసుల అక్రమ నిర్బంధాలను, ఆంక్షలను తెంచుకుంటూ వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో బైక్‌ ర్యాలీలు, పాదయాత్రలకు అనుమతి లేదంటూ ర్యాలీలు ప్రారంభానికి 10 నిమిషాలు, అర్ధగంట ముందే పోలీసులు నోటీసులు ఇచ్చారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురవుతాయనే నెపంతో నిరసనలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నియోజకవర్గ కేంద్రాల్లో వందలాది మంది పోలీసులను మోహరించి బారికేడ్లు, రోప్‌లతో అడ్డుకున్నారు. అయినా సరే, యువత అవేమీ లెక్కచేయకుండా బారికేడ్లను తొలగించుకుని ముందుకు దూసుకెళ్లారు. దీంతో పలు ప్రాంతాల్లో పోలీసులు, వైఎస్సార్‌సీపీ శ్రేణుల మధ్య తీవ్ర తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బైక్‌ ర్యాలీలకు అనుమతి నిరాకరించడంతో నాయకులు, విద్యార్థులు పాదయాత్రలుగా మారి నిరసన తెలిపారు.

ఉద్రిక్తల నడుమ ర్యాలీ...

అనకాపల్లి నియోజకవర్గంలో సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్‌, జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌ నేతృత్వంలో నియోజకవర్గంలో యువత, విద్యార్థులు, వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. పోలీసుల అక్రమ నిర్బంధాలను అధిగమించి నిరసన ర్యాలీను విజయవంతంగా ముగించారు. ర్యాలీ ప్రారంభమయ్యే పది నిమిషాల ముందు పోలీసులు అనుమతి లేదంటూ నోటీసులు జారీ చేశారు. అయినా యువత, విద్యార్థులు తగ్గేదేలేదంటూ సోమవారం ఉదయం 10.30 గంటలకు సుంకరమెట్ట జంక్షన్‌ నుంచి బాలకృష్ణ బస్ట్‌ స్టాప్‌ వరకూ 1 కి.మీ మేర బైక్‌ ర్యాలీ చేశారు. ర్యాలీలో భారీగా యువత, విద్యార్థులు పాల్గొనడంతో పథకం ప్రకారం బాలకృష్ణ బస్‌ స్టాప్‌ వద్ద రోపుతో బైక్‌ ర్యాలీను అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ర్యాలీ చేస్తే అరెస్ట్‌ చేస్తామంటూ బెదిరింపులకు పాల్ప డ్డారు. దీంతో జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌, సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్‌ నేతృత్వంలో బైక్‌ ర్యాలీ కాకుండా పాదయాత్రగా ర్యాలీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయినా పోలీసులు ఆగలేదు. అనకాపల్లి ఇన్‌చార్జి డీఎస్పీ మోహన్‌రావు నేతృత్వంలో భారీగా పోలీసులు మోహరించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, యువత, విద్యా ర్థులను అడ్డుకున్నారు. దీంతో యువతకు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. యువత ర్యాలీ ని పోలీసు నిర్బంధాలు ఆపలేకపోయాయి. అక్కడ నుంచి పాదయాత్రగా మరో రెండు కి.మీ మేర ర్యాలీ సాగించి విజయవంతంగా ముగించారు. నియోజకవర్గ పరిశీలకుడు సతీష్‌వర్మ, రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్‌, మందపాటి జానకీరామ్‌, గొర్లిసూరిబాబు పాల్గొన్నారు.

బారికేడ్లు, రోప్‌లు దాటి..

పాయకరావుపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీలకు యువత, విద్యార్థులు బ్రహ్మరథం పట్టారు. శాంతియుత ర్యాలీను పోలీసులు అడ్డుకునే ప్రయత్నంచేశారు. పోలీసుల ఉద్రిక్తత నడుమ డీఎస్సీ అక్రమాలపై యువత, విద్యార్థులు తలపెట్టిన నిరసన ర్యాలీ సాగింది. ఉదయం 11 గంటలకు పాయకరావుపేట టౌన్‌లో పంచాయితీ కార్యాలయం వద్ద నుంచి పాదయాత్రగా ర్యాలీ ప్రారంభమైంది. పార్టీ కార్యాలయం నుంచి ఒక కి.మీ మేర పాదయాత్ర చేశారు. ర్యాలీని పోలీసులు రోపుతో అడ్డుకున్నారు. అయినా ఆగకుండా పోలీసుల రోపును తోసుకుంటూ అర కిలోమీటర్‌ వరకూ ర్యాలీ చేశారు. అక్కడ పూర్తి స్థాయిలో పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే నినాదాలు చేసి ర్యాలీ ముగించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు, వీసం రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు పాల్గొన్నారు.

అడుగడుగునా అడ్డంకులు

యలమంచిలి నియోజకవర్గంలో మాజీ ప్రభుత్వ విఫ్‌, సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. పోలీసులు ఆంక్షల నడుమ శాంతియుతంగా నిరసన ర్యాలీ విజయవంతం చేశారు. ఉదయం 10 గంటలకు ర్యాలీ నిర్వ హించాలని భావించారు. ఇంతలో పోలీసులు వచ్చి ర్యాలీకు అనుమతి లేదంటూ నోటీసులు జారీ చేశారు. అయినా ర్యాలీ ఆపేది లేదంటూ ఉదయం 10.30 గంటలకు పాదయాత్రగా ర్యాలీ చేశారు. ముగ్గురు ఎస్‌ఐ, ఇద్దరు సీఐలతో పోలీస్‌ సిబ్బంది అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎక్కడా ఆగలేదు. పార్టీ కార్యాలయం నుంచి వైఎస్సార్‌ విగ్రహం వరకూ కిలోమీటరన్నర పాటు పాదయాత్రగా ర్యాలీ చేశారు. ఎస్‌ఈసీ సభ్యుడు బోదెపు గోవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

గంటన్నర పాటు గృహ నిర్బంధం

అడ్డుకున్నా..రెట్టింపు ఉత్సాహంతో ముందడుగు

చోడవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి, సమన్వయకర్త గుడివాడ అమర్‌నాథ్‌ నేతృత్వంలో పోలీసుల ఆంక్షల నడుమ పాదయాత్ర ర్యాలీ విజయవంతంగా సాగింది. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను ర్యాలీ చేస్తే అరెస్ట్‌ చేస్తామంటూ పోలీసులు బెదిరించే ప్రయత్నాలకు పాల్పడ్డారు. ఉదయం 10 గంటలకు ప్రభుత్వ హైస్కూల్‌ జంక్షన్‌ నుంచి పాదయాత్రగా ర్యాలీ ప్రారంభమయ్యే అర్థ గంట పోలీసులు అనుమతి లేదంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు నోటీసు జారీ చేశారు. అయినా ఎక్కడా ర్యాలీ అపేది లేదంటూ యువత, విద్యార్థులు చెప్పడంతో పోలీసులు అడ్డుకునేందుకు తీవ్ర యత్నం చేశారు.

భారీగా యువత, విద్యార్థులు, వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు రావడంతో పోలీసులు అడ్డుతప్పుకున్నారు. ప్రభుత్వ హైస్కూల్‌ జంక్షన్‌ నుంచి కొత్తూరు జంక్షన్‌ వరకూ 2 కి.మీ మేర పాదయాత్రగా రెట్టింపు ఉత్సాహంతో యువత, విద్యార్థులు, వైఎస్సార్‌ సీపీ నాయకులు శాంతియుత ర్యాలీ చేశారు. నియోజకవర్గ పరిశీలకులు గండి రవికుమార్‌, రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు వెంకటేష్‌,ముఖ్యనాయకుడు దొండా రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

అడుగడుగునా పోలీసుల ఆంక్షలు.. ర్యాలీకి ముందు నోటీసులు

పోలీసు నిర్బంధాలను అఽధిగమించి వైఎస్సార్‌సీపీ యువ గర్జన

పోలీస్‌ రోప్‌లు, బారికేడ్లు తొలగించుకొని దూసుకెళ్లిన యువత

బైక్‌ ర్యాలీలకు అనుమతించకపోవడంతో పాదయాత్రగా ర్యాలీలు

నియోజకవర్గం కేంద్రంలో వందలాది పోలీసులతో అడ్డగింత, తోపులాట

భారీగా తరలి వచ్చిన యువత, విద్యార్థులు, వైఎస్సార్‌సీపీ నాయకులు

గంటన్నర పాటు గృహ నిర్బంధంలో మాజీ ఎమ్మెల్యే గణేష్‌

డీఎస్సీ అక్రమాలపై లోకేష్‌ రాజీనామా, సీబీఐ విచారణ కోరుతూ హోరెత్తిన నినాదాలు

నర్సీపట్నం నియోజకవర్గంలో సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన ర్యాలీను అడ్డుకున్నారు. ఆయనను గంట పాటు గృహ నిర్బంధంలో ఉంచారు. నిరసన చేయడానికి అనుమతి లేదంటూ ర్యాలీకు గంట ముందే నోటీసులు జారీ చేశారు. గణేష్‌ ఇంటికి సమీపంలోని మెయిన్‌ రోడ్డుపై పోలీసులు అధిక సంఖ్యలో మోహరించారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులను గణేష్‌ నివాసానికి వెళ్లకుండా నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయకర్త ఇంటికి రావడంతో అక్కడ నుంచి పోలీసులను నిర్భందాలను అధిగమించి శాంతియుతంగా పాదయాత్ర ర్యాలీ చేశారు. పోలీసులు భారీ రోప్‌లు వేసి అడ్డుకున్నారు. దీంతో మెయిన్‌ రోడ్డుపై గణేష్‌తో పాటు యువత, విద్యార్థులు, వైఎస్సార్‌సీపీ నాయకులు బైటాయించారు. శాంతియుతంగా నిరసన చేస్తుంటే అడ్డుకోవటం మంచి పద్ధతి కాదని గణేష్‌ పోలీసుతో వాదనకు దిగారు. దీంతో సీఐ గపూర్‌, గణేష్‌కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ గణేష్‌ రోడ్డుపై బైఠాయించారు. జెండాలు, ప్లేకార్డులతో పార్టీ శ్రేణులు చేతపట్టి మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement