పీజీఆర్‌ఎస్‌పై తగ్గుతున్న నమ్మకం | - | Sakshi
Sakshi News home page

పీజీఆర్‌ఎస్‌పై తగ్గుతున్న నమ్మకం

Aug 11 2026 1:06 AM | Updated on Aug 11 2026 1:06 AM

● సమస్యలపై మొక్కుబడి స్పందన ● అర్జీదారుల అసహనం

తుమ్మపాల : సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలనే ఆశతో కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమాలకు వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, వివిధ వర్గాల ప్రజలు వ్యయప్రయాసల కోర్చి వచ్చారు. జిల్లా అత్యున్నత అధికారి కలెక్టర్‌ను కలిసి తమ సమస్యను వివరించినప్పటికీ, అర్జీ పరిష్కారం మాత్రం కింది స్థాయి అధికారుల పరిధిలోకి వెళ్లడంతో అక్కడే సమస్యలు ఎదురవుతున్నాయని పలువురు అర్జీదారులు చెబుతున్నారు. పీజీఆర్‌ఎస్‌లో అర్జీ సమర్పించినా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదని వాపోతున్నారు. దీంతో పీజీఆర్‌ఎస్‌పై ప్రజల్లో క్రమంగా నమ్మకం సన్నగిల్లుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే కలెక్టరేట్‌కు వచ్చే అర్జీదారుల కోసం ఇటీవల కొన్ని వారాలుగా భోజన సౌకర్యం ఏర్పాటు చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అయితే అర్జీదారులు కూర్చునేందుకు సరిపడా కుర్చీలు, ఎండ నుంచి రక్షణ కల్పించే టెంట్లు, తాగునీటి వంటి సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ఎండలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని చెబుతున్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌ల కార్యక్రమంలో జేసీ శౌర్యమాన్‌ పటేల్‌, డీఆర్వో వై.సత్యనారాయణరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 306 అర్జీలు ననమోదు కాగా వాటిలో 170 అర్జీలు రెవెన్యూ సమస్యలపైనే ఉన్నాయి. పీజీఆర్‌ఎస్‌, ఐసీడీఎస్‌ పీడీ సూర్యలక్ష్మి, జిల్లా ఎకై ్సజ్‌ అధికారి వి.సుధీర్‌, పలు శాఖల అధికారులు గోపాల్‌ రాజా, ఆశా దేవి పాల్గొన్నారు.

నూరుశాతం వైకల్యం..పింఛను అందించరూ..

వైద్య అధికారుల నమోదు చేసిన వివరాల్లో జరిగిన తప్పిదం కారణంగా 100 శాతం దివ్యాంగుడైన తన కుమారుడికి ప్రభుత్వం అందించాల్సిన పూర్తి పింఛన్‌ అందడం లేదని అనకాపల్లి మండలం గొలగాం పంచాయతీ కొత్తతలారివానిపాలెం గ్రామానికి చెందిన గంతకోరు సత్యవతి ఆవేదన వ్యక్తం చేసింది. పుట్టుకతో దివ్యాంగుడైన తన కుమారుడి జశ్వంత్‌ సదరం సర్టిఫికెట్‌లో దివ్యాంగత్వాన్ని తప్పుగా నమోదు చేయడంతో నెలకు రూ.6 వేల పింఛన్‌ మాత్రమే వస్తోందని, దీనిని సరిచేసి ప్రభుత్వం అమలు చేస్తున్న రూ.15 వేల పింఛన్‌ అందించాలని కోరింది.

ఏఎంఆర్‌ అక్రమ వసూళ్లపై ఫిర్యాదు

ఏఎంఆర్‌ సంస్ధ చెక్‌పోస్టులను తొలగించి ప్రతినిధులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ట్రాక్టర్‌ ఓనర్స్‌,డ్రైవర్స్‌ కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. సీనరేజ్‌ పేరుతో ప్రతి గ్రామంలో చెక్‌పోస్టులు పెట్టి మైనింగ్‌ లారీల నుంచి సరుకు టన్నుల లెక్కన లెక్కింపు చేసి వసూళ్లు చేసిన సోమ్మును ప్రభుత్వానికి చెల్లింపులు చేయకుండా అక్రమ బిల్లులతో ఏఎంఆర్‌ సంస్ధ దోచుకుంటుందని ఆరోపించారు. అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్న ఆ సంస్థ ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించారు.

భూ నిర్వాసితుల హామీలు నెరవేర్చండి..

పూడిమడక వద్ద ఎన్‌టీపీసీ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ భూ నిర్వాసిత రైతులకు ఉద్యోగ, ఉపాధి, ఆర్‌అండ్‌ఆర్‌ కార్డులు మంజూరు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ నిర్వాసితులు కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. ఈమేరకు స్పష్టమైన రాత పూర్వక హమీ ఇచ్చిన తర్వాతే ప్రాజెక్టు నిర్మాణ పనులను చేపట్టాలని పీజీఆర్‌ఎస్‌లో వినతి అందించారు.

పాస్టర్ల నిరసన

క్రైస్తవులను కూడా షెడ్యూల్డ్‌ కులాలుగా గుర్తిస్తూ 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను అమలుచేసి వేధింపులు, దాడులు, అఘాయిత్యాల నుంచి క్రైస్తవ మైనారిటీ సమాజాన్ని రక్షించాలంటూ పాస్టర్లు కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపి డీఆర్వోకు వినతిపత్రం అందించారు. షెడ్యూల్డ్‌ కులాల మూలానికి చెందిన క్రైస్తవులను షెడ్యూల్డ్‌ కులాల హోదా నుంచి మినహాయించడం అన్యాయం అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ కోఆప్షన్‌ సభ్యులు, వైస్సార్‌సీపీ క్రిస్టియన్‌ మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు జోసెఫ్‌, క్రిస్టియన్‌ సంఘ పెద్దలు ఫాదర్స్‌ జోసఫ్‌ ప్రభాకర్‌, రవీంద్ర, రత్నాకర్‌, ప్రసాధ్‌, బాలరాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement