సాగునీటి వనరులూ మిట్టల్‌ స్టీల్‌కే...! | - | Sakshi
Sakshi News home page

సాగునీటి వనరులూ మిట్టల్‌ స్టీల్‌కే...!

Aug 11 2026 1:06 AM | Updated on Aug 11 2026 1:06 AM

● రెవెన్యూ సన్నాహాలు ● కాగితలో 17 ఎకరాల బదలాయింపునకు నోటీసులు జారీ ● అన్నదాతల్లో ఆందోళన

నక్కపల్లి : కూటమి ప్రభుత్వం ఆర్సిలర్‌ మిట్టల్‌ స్టీల్‌ప్లాంట్‌ కోసం అన్నదాతలకు అన్యాయం తలపెడుతోంది. తరతరాలుగా సాగు అవసరాల కోసం ఉపయోగిస్తున్న వనరులను స్టీల్‌ప్లాంట్‌ ప్రయోజనాల కోసం కేటాయించేందుకు నిర్ణయించింది. మండలంలో కాగిత రెవెన్యూ పరిధిలో 17 ఎకరాల చెరువులు, గెడ్డలు గ్రామకంఠం భూములను ఏపీఐఐసీ ద్వారా స్టీల్‌ప్లాంట్‌కు బదలాయించేందుకు తెరలేపింది. దీనికి సంబంధించిన అభ్యంతరాలు ఉంటే తెలియజేసుకోవాలని గ్రామ పంచాయతీలో నోటీసుల ద్వారా తెలియజేసింది. వివరాల్లోకి వెళ్తే... మండలంలో ఆర్సిలర్‌ మిట్టల్‌ స్టీల్‌ప్లాంట్‌ కోసం 2250 ఎకరాల భూములు కేటాయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే కాగిత గ్రామస్తులు తమ రెవెన్యూ పరిధిలో సుమారు 30 ఎకరాలను 80 అడుగుల రోడ్డుకోసం త్యాగం చేశారు. ఇపుడు రైతులు సాగు చేసుకుంటున్న భూములకు జీవనాధారమైన చెరువులు, గెడ్డలు, ఇతర సాగునీటి వనరులను సైతం స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే జరిగితే ఈ నీటి వనరులపై ఆధారపడి సాగు చేసుకుంటున్న భూములన్నీ బీడు భూములుగా మారే ప్రమాదం ఉందంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే ప్రతిపాదన వస్తే హోంమంత్రిని ఆశ్రయిస్తే అటువంటి సమస్యలు రాకుండా చూస్తానని హామీ ఇచ్చారని, ఇప్పుడు రెవెన్యూ అధికారులు కాగిత పరిధిలో ఉన్న చెరువులను స్టీల్‌ప్లాంట్‌కు ధారాదత్తం చేసే ప్రక్రియ చేపట్టంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆ భూములు బీడు వారాల్సిందేనా...

ఈ చెరువులు, గెడ్డల కింద సుమారు 200 ఎకరాల వరకు ఆయకట్టు భూములున్నాయని, వరి, అపరాలు, కూరగాయలు ఉద్యానవన పంటలు సాగు చేస్తుంటామని రైతులు చెబుతున్నారు. తక్షణమే ప్రభుత్వం సాగునీటి వనరుల బదలాయింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కాని పక్షంలో బోర్లు, వ్యవసాయ బావులు తదితర ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement