దేవరాపల్లి : జిల్లాలో కరువు సహాయక చర్యలు చేపట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయనబాబు డిమాండ్ చేశారు. సీఐటీయూ, ఏపీ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దేవరాపల్లిలో సోమవారం ‘జైల్ భరో’ కార్యక్రమం జరిగింది. రైవాడ అతిథి గృహం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీగా చేరుకొని అక్కడ మానవహారంగా ఏర్పడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. నాయనబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బి.టి. దొర, ఈర్లె నాయుడుబాబు, రొంగలి ముత్యాలనాయుడు, గాడి ప్రసాద్ మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం రూ. 31 వేలు ఇవ్వాలని, ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఉచిత పంటల బీమా అమలు చేయాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు.


