● నీటి వినియోగంలో ఒడిశా ముందంజ
● ఏపీ వాటా 69.81 టీఎంసీలు
● ఒడిశాకు 2,300 క్యూసెక్కులు
● నీటి విడుదలపై ఏకగ్రీవ నిర్ణయం
సీలేరు: ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల్లోని జలవిద్యుత్ కేంద్రాలకు నీటిని సరఫరా చేసే ఉమ్మడి బలిమెల జలాశయం నీటి వినియోగంపై ఇరు రాష్ట్రాల అధికారులు బుధవారం సీలేరు కాంప్లెక్స్ పరిధిలోని డొంకరాయిలో సమావేశమయ్యారు. 2026–27 నీటి సంవత్సరంలో ఇప్పటివరకు ఇరు రాష్ట్రాలు వినియోగించుకున్న నీటి పరిమాణంపై లెక్కలు తేల్చారు. అక్టోబరు నెలలో ఒడిశా తన వాటాగా 7.3658 టీఎంసీల నీటిని వినియోగించుకోగా, ఆంధ్రప్రదేశ్ 1.7178 టీఎంసీలను వాడుకున్నట్లు లెక్కలు నిర్ధారించారు. దీంతో అక్టోబరులో ఏపీ కంటే ఒడిశా 5.6480 టీఎంసీల నీటిని అధికంగా వినియోగించుకుంది. అలాగే 2026–27 నీటి సంవత్సరంలో జూలై నుంచి అక్టోబరు చివరి వరకు ఒడిశా 14.8468 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 8.0126 టీఎంసీల నీటిని వినియోగించుకున్నట్లు అధికారులు లెక్కించారు. ఈ లెక్కల ప్రకారం ఇప్పటివరకు ఏపీ కంటే ఒడిశా 6.8342 టీఎంసీల నీటిని అధికంగా వాడుకుంది. ఇక 2025–26 నీటి సంవత్సరంలో ఒడిశా, ఆంధ్రప్రదేశ్ కంటే 22.6865 టీఎంసీల నీటిని అధికంగా వినియోగించుకుంది. దీంతో గత నీటి సంవత్సరంతో పాటు ప్రస్తుత నీటి సంవత్సరం అక్టోబరు చివరి నాటికి ఒడిశా అధికంగా వినియోగించుకున్న నీటి పరిమాణం 29.5207 టీఎంసీలకు చేరినట్లు లెక్కల ప్రకారం తెలుస్తోంది.ప్రస్తుతం బలిమెల, జోలాపుట్ జలాశయాల్లో కలిపి 110.1095 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటాగా 69.8151 టీఎంసీలు, ఒడిశా వాటాగా 40.2944 టీఎంసీలను కేటాయించారు. ఇరు రాష్ట్రాల సాగునీటి, విద్యుదుత్పత్తి అవసరాల నిమిత్తం బలిమెల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 2,500 క్యూసెక్కులు, ఒడిశాకు 2,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని అధికారులు ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తరఫున ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్స్ సూపరింటెండింగ్ ఇంజినీర్ షేక్ జాకీర్ హుస్సేన్, ఈఈ టి.అప్పలనాయుడు, డీఈఈ కె.శివశంకరరావు, ఏఈఈలు కె.శ్యామల, అనుదీప్ పాల్గొన్నారు. ఒడిశా తరఫున పొట్టేరు ఇరిగేషన్ చీఫ్ కన్స్‌ట్రక్షన్ ఇంజినీర్ త్రుప కుమార్ పాత్ర తదితరులు హాజరయ్యారు.


