మన్యంలో ఫ్యాన్‌ జోరు! | - | Sakshi
Sakshi News home page

మన్యంలో ఫ్యాన్‌ జోరు!

Nov 19 2026 1:07 AM | Updated on Nov 19 2026 1:07 AM

● నేడు ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికలు ● మెజారిటీ స్థానాలు కై వసం చేసుకోనున్న వైఎస్సార్‌సీపీ ● 11 మండలాల్లో ఏర్పాట్లు పూర్తి

ఏజెన్సీ రాజకీయాల్లో వైఎస్సార్‌సీపీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కై వసం చేసుకుని ఎంపీపీ పీఠాలు కై వసం చేసుకోనుంది. జిల్లాలోని 172 ఎంపీటీసీ స్థానాలకు గాను 88 స్థానాల్లో విజయం సాధించి ప్రత్యర్థి పార్టీల కంటే ముందంజలో నిలిచింది.

సాక్షి, పాడేరు: ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలుగా విజయం సాధించిన అభ్యర్థులతో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ టి.నిశాంతి ఆదేశాల మేరకు గురువారం జిల్లాలోని 11 మండలాల్లో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికలతోపాటు కో–ఆప్షన్‌ సభ్యుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు.

అన్ని మండల పరిషత్‌ కార్యాలయాల సమావేశ మందిరాల్లో ఉదయం 10 గంటల నుంచి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు చేతులెత్తే విధానంలో ఎంపీపీ ఎన్నికలు నిర్వహిస్తారు. అనంతరం వైస్‌ ఎంపీపీ, కో–ఆప్షన్‌ సభ్యుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు.

మెజార్టీ ఎంపీపీ స్థానాలు వైఎస్సార్‌సీపీకే!

జిల్లాలోని 11 మండలాల్లో అత్యధిక ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ కై వసం చేసుకుంది. దీంతో పాడేరు, చింతపల్లి, గూడెంకొత్తవీధి, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు, అనంతగిరి, జి.మాడుగుల, డుంబ్రిగుడ మండలాల్లో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ పదవులు ఆ పార్టీకి దక్కే అవకాశాలు ఉన్నాయి. అరకు లోయ, కొయ్యూరు మండలాల్లో టీడీపీ అత్యధిక ఎంపీటీసీ స్థానాలు గెలుచుకోవడంతో అక్కడ ఆ పార్టీకి ఆధిక్యం లభించనుంది.

మండలాల వారీగా ఎంపీటీసీ స్థానాలు

జిల్లాలోని 11 మండలాల్లో మొత్తం 172 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. వీటిలో వైఎస్సార్‌సీపీ 88, టీడీపీ 47, జనసేన 12, కాంగ్రెస్‌ ఒకటి, సీపీఎం రెండు, బీజేపీ ఐదు, స్వతంత్రులు 17 స్థానాల్లో విజయం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement