కొయ్యూరు: ఎంపీపీ ఎన్నికకు ముందు కో–ఆప్షన్ సభ్యుడి ఎన్నిక నిర్వహిస్తామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్వో) వై.వి. నరసింహారావు తెలిపారు. ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తొలుత కో–ఆప్షన్ సభ్యుడి ఎన్నిక ఉంటుందని, అనంతరం మధ్యాహ్నం ఎంపీపీ ఎన్నిక నిర్వహిస్తామని బుధవారం విలేకరులకు వెల్లడించారు. ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎంపీటీసీ సభ్యులతో నూతన ఎంపీపీ సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. ఈ మేరకు ఆయా పార్టీల నాయకులకు సమాచారం అందించామన్నారు. పార్టీల తరఫున విప్‌లుగా వ్యవహరించే వారు కూడా హాజరుకావచ్చని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు.
నోడల్ అధికారిగా నియామకం
ఇదిలా ఉండగా, తొలి విడత సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కొయ్యూరు మండల నోడల్ అధికారిగా చింతపల్లి డీఎఫ్‌వో నరసింహారావును కలెక్టర్ నిశాంతి నియమించారు. ఈ నేపథ్యంలో ఆయన ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమావేశమై ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి వైవీ నర్సింహరావు


