● ఏజెన్సీలో 55 మి.మీ. వర్షపాతం నమోదు అవకాశం
● చింతపల్లి ఏడీఆర్ ఆదిలక్ష్మి
చింతపల్లి: అల్లూరి జిల్లాలో ఈ నెల 22వ తేదీ వరకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ డి. ఆదిలక్ష్మి తెలిపా రు. ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు జిల్లాలోని వాతావరణ పరిస్థితుల వివరాలను వెల్లడించారు. చింతపల్లి, పాడేరు, అరకులోయ డివిజన్ల పరిధిలో 12.2 నుంచి 55 మిల్లీమీటర్ల వరకు మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 25.5 నుంచి 27.8 డిగ్రీల సెల్సియస్ మధ్య, కనిష్ట ఉష్ణోగ్రతలు 14 నుంచి 16.5 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. గాలిలో సాపేక్ష ఆర్ద్రత ఉదయం వేళల్లో 73 నుంచి 95 శాతం, మధ్యాహ్నం వేళల్లో 75 నుంచి 95 శాతం మధ్య ఉండవచ్చన్నారు. గంటకు 6 నుంచి 22 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఆక్టా 5–8 మేఘావృత పరిస్థితులు ఉంటాయని, ఆకాశం నిర్మలంగా ఉండే అవకాశముందని వివరించారు. రైతులు పంటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏడీఆర్ సూచించారు.


