యువతి మృతదేహం కలకలం | - | Sakshi
Sakshi News home page

యువతి మృతదేహం కలకలం

Nov 19 2026 1:07 AM | Updated on Nov 19 2026 1:07 AM

అరకులోయ టౌన్‌ (డుంబ్రిగుడ): అరకులోయ సమీపంలోని చొంపి జంక్షన్‌ వద్ద నూతన జాతీయ రహదారి వంతెన కింద బుధవారం ఉదయం యువతి మృతదేహం కలకలం రేపింది. మృతురాలిని డుంబ్రిగుడ మండలం గుంటగన్నేల గ్రామానికి చెందిన కిల్లో మీనాక్షి (20)గా గుర్తించారు. ఆమె ప్రస్తుతం అరకులోయలోని ఐటీఐలో మొదటి సంవత్సరం ఎలక్ట్రానిక్స్‌ చదువుతోంది. ఘటనపై సమాచారం అందుకున్న అరకులోయ సీఐ ఏ.కోటేశ్వరరావు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని అరకులోయ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హత్యగా అనుమానిస్తున్న కుటుంబ సభ్యులు

మీనాక్షి మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం తన కుమార్తె సోదరుడికి, నాయనమ్మకు ఫోన్‌ చేసి ఐటీఐ శిక్షణ తరగతుల నిమిత్తం విశాఖపట్నం వెళ్తున్నానని, మూడు నెలల పాటు అక్కడే ఉంటానని చెప్పినట్లు తండ్రి కిల్లో కృష్ణంరాజు తెలిపారు. తాను ఉంటున్న అద్దె గదిని ఖాళీ చేసి సామాన్లు ఇంటికి తీసుకెళ్లాలని కూడా ఫోన్‌ చేసినట్లు వివరించారు. దీంతో బుధవారం కుటుంబ సభ్యులు అరకులోయకు వచ్చి గది అద్దె, విద్యుత్‌ బిల్లులతో కలిపి మొత్తం రూ.1,900 బకాయిలు చెల్లించి సామాన్లను ఆటోలో ఎక్కించుకున్నారు. స్వగ్రామమైన గుంటగన్నేల వెళ్తుండగా, చొంపి వంతెన వద్ద మృతదేహం తమ కుమార్తెదిగా అనుమానిస్తున్నట్లు సోదరుడి నుంచి ఫోన్‌ రావడంతో తిరిగి వెళ్లి చూశామని, అది మీనాక్షి మృతదేహమేనని గుర్తించి కన్నీరుమున్నీరయ్యామని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ యువకుడిపై అనుమానం:

మృతురాలి తండ్రి డిమాండ్‌

డుంబ్రిగుడ మండలం కితంగి పంచాయతీ గాంధీ గ్రామానికి చెందిన పవన్‌ అనే యువకుడితో తన కుమార్తెకు పరిచయం, ప్రేమ వ్యవహారం ఉందని, అతడిపై అనుమానం ఉందని తండ్రి పేర్కొన్నారు. తన కుమార్తె మృతిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. యువతి మృతిపై బంధువులు, కుటుంబ సభ్యులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు బాధ్యులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ ర్యాలీ, మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు.

చొంపి జంక్షన్‌ వద్ద అనుమానాస్పదంగా యువతి మృతి

గుంటగన్నేలకు చెందిన మీనాక్షిగా గుర్తింపు

ప్రేమ వివాహమే కారణమనిమృతురాలి తండ్రి ఆవేదన

కేసు నమోదు చేసిన పోలీసులు

హత్యా.. ఆత్మహత్యా కోణంలో పోలీసుల దర్యాప్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement