కొయ్యూరు: నామినేషన్ స్వీకరణ సమయంలో ఎలాంటి పొరపాట్లు చేయవద్దని జిల్లా పరిషత్ సీఈవో వాసుదేవరావు సూచించారు. అభ్యర్థులు నామినేషన్ పత్రాలను తీసుకువచ్చిన తర్వాత ఆయా క్లస్టర్ల వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌లు విధిగా వాటిని పరిశీలించాలన్నారు. మండలంలోని ఎం.మాకరం, కొండగోకిరి ప్రాంతాల్లోని నామినేషన్ కేంద్రాలను ఆయన సోమవారం పరిశీలించారు. అక్కడి ఎన్నికల అధికారులతో మాట్లాడి పలు సూచనలిచ్చారు. నామినేషన్ పత్రాలను పరిశీలించి, తప్పులుంటే అభ్యర్థులకు సరిచేసుకోవాలని తెలియజేయాలన్నారు. అనంతరం ఆర్‌వోలు పరిశీలించిన తరువాత పత్రాలను స్వీకరించాలన్నారు.కొయ్యూరు మండలంలోని 33 పంచాయతీలుండడంతో నామినేషన్లు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయని, ఎన్నికల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో సిబ్బందితో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు అడిగిన సమాచారం పంపాలన్నారు. ఆయన వెంట ఎంపీడీవో ప్రసాదరావు, డీఈవో జయప్రకాశ్‌రావు ఉన్నారు.
జెడ్పీ సీఈవో వాసుదేవరావు


