గిరి రైతుకు తుపాను గండం | - | Sakshi
Sakshi News home page

గిరి రైతుకు తుపాను గండం

Nov 18 2026 12:26 AM | Updated on Nov 18 2026 12:26 AM

వరుస తుపాన్లు గిరిజన రైతులను

కలవరపెడుతున్నాయి. ఇప్పటికే ఖరీఫ్‌ సాగుతో పెట్టుబడులు పెట్టిన అన్నదాతలకు ప్రకృతి ప్రకోపం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. చేతికొచ్చే దశలో ఉన్న పంటలు తుఫాన్ల బారిన పడతాయేమోనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. దీంతో గిరిజన

రైతాంగం దిగాలు చెందుతోంది.

సాక్షి, పాడేరు: వరుస తుఫాన్లు గిరిజన రైతులను కలవరపెడుతున్నాయి. చేతికొచ్చిన ఖరీఫ్‌ పంటలు తుఫాన్‌ ముంపునకు గురయ్యే ప్రమాదం ఉండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్‌లో 44 వేల హెక్టార్లలో వరి, మరో 20 వేల హెక్టార్లలో చిరుధాన్యాలను గిరిజన రైతులు సాగు చేశారు. ఇప్పటికే రెండు తుఫాన్‌ల ప్రభావంతో సుమారు 100 ఎకరాల్లోని లోతట్టు వరి పొలాలకు నష్టం వాటిల్లింది. ముందస్తుగా పంట పొలాల్లో కాలువలు తవ్వుకోవడంతో చాలా వరకు ముంపు ముప్పు తప్పింది. అయితే కాఫీ తోటలు, చిరుధాన్యాలు, వలిసె పంటలకు కూడా నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. అయినప్పటికీ బాధిత రైతులకు ఇప్పటివరకు ఎలాంటి పరిహారం అందలేదు. ఈ తరుణంలో మరోసారి అక్వాన్‌ తుఫాన్‌ భయం గిరిజన రైతులను వెంటాడుతోంది.

కోత దశలో పంటలు

జిల్లా వ్యాప్తంగా వరితో పాటు చిరుధాన్యాల పంటలు కోత దశకు చేరుకుని కళకళలాడుతున్నాయి. 44 వేల హెక్టార్ల వరి సాగులో ఇప్పటివరకు 10 శాతం మాత్రమే కోతలు పూర్తయ్యాయి. మిగిలిన 90 శాతం పంటను కోసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే అక్వాన్‌ తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న సమాచారంతో పంటలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటికే కోత కోసిన వరి పనలను సురక్షిత ప్రాంతాలకు తరలించి కుప్పలుగా వేస్తున్నారు. మరికొందరు యంత్రాల సాయంతో వెంటనే ధాన్యం నూర్పిడి చేస్తున్నారు. ఆర్థిక స్తోమత లేని రైతులు మాత్రం కోతలు వాయిదా వేసి, వర్షపు నీరు నిల్వ ఉండకుండా పొలాల మధ్య కాలువలు తవ్వుకుంటున్నారు.

● మరోవైపు రాగులు, సామలు, కొర్రలు వంటి చిరుధాన్యాల పంటలు కూడా కోత దశలో ఉన్నాయి. సుమారు 20 వేల హెక్టార్లలో సాగైన ఈ పంటలు భారీ వర్షాలకు నేలవాలితే గింజలు రాలిపోయి తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టి పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి ప్రకోపం తమను నష్టాలపాలు చేస్తుందేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కోత దశలో ఖరీఫ్‌ పంటలు

44 వేల హెక్టార్లలో వరి సాగు

20 వేల హెక్టార్లలో చిరుధాన్యాలు

ఇప్పటికే రెండు తుపాన్లతో పంట నష్టం

అక్వాన్‌ ముప్పుతో అన్నదాతల్లో ఆందోళన

తాత్కాలికంగా కోతలు నిలిపివేయాలని వ్యవసాయ శాఖ సూచన

పంట కోతలను ఆపాలి

తుఫాన్‌ ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని రైతులంతా తాత్కాలికంగా పంట కోతలను నిలిపివేయాలి. ప్రస్తుతం కోత కోసిన వరి, ఇతర చిరుధాన్యాల పనలను సురక్షిత ప్రాంతాలకు తరలించి కుప్పలుగా ఏర్పాటు చేసుకోవాలి. అన్ని కుప్పలపై టార్పాలిన్లు కప్పుకోవాలి. పంట పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా ముందస్తుగానే కాలువలు తవ్వుకోవాలి.

– ఎస్‌బీఎస్‌ నందు,

జిల్లా వ్యవసాయాధికారి, పాడేరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement