అడుగడుగునా ప్రమాదం.. అయినా బడి బాటే! | - | Sakshi
Sakshi News home page

అడుగడుగునా ప్రమాదం.. అయినా బడి బాటే!

Nov 18 2026 12:26 AM | Updated on Nov 18 2026 12:26 AM

జి.మాడుగుల: చదువుకోవాలనే తపన ఉన్నా.. బడికి చేరుకోవాలంటే అడుగడుగునా అవస్థలు తప్పడం లేదు. మండలంలోని మారుమూల వయ్యంపల్లి గ్రామానికి చెందిన 15 మంది విద్యార్థులు నిత్యం కొండలు, గుట్టలు ఎక్కిదిగుతూ, దట్టమైన అటవీ మార్గంలో అష్టకష్టాలు పడుతూ పాఠశాలకు రాకపోకలు సాగిస్తున్నారు. లువ్వాసింగి పంచాయతీ పరిధిలోని వయ్యంపల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తరాబ్‌సింగి గ్రామంలోని పాఠశాలకు ప్రతిరోజూ కాలినడకన వెళ్లి చదువుకుంటున్నారు. మార్గమధ్యంలో కొండలు, లోయలు దాటుకుంటూ ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకునే వరకు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వయ్యంపల్లి–తరాబ్‌సింగి గ్రామాల మధ్య దట్టమైన అటవీ ప్రాంతం ఉండటంతో క్రూరమృగాలు, విషసర్పాల సంచారం ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. తమ పిల్లలు క్షేమంగా ఇంటికి చేరుకునే వరకు బిక్కుబిక్కుమంటూ ఎదురుచూడాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు ప్రమాదకరమైన అటవీ మార్గంలో కొండలు, గుట్టలు ఎక్కిదిగుతూ పాఠశాలకు వెళ్తున్న వీడియో ప్రస్తుతం పలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వయ్యంపల్లి–తరాబ్‌సింగి గ్రామాల మధ్య రహదారి సౌకర్యం కల్పించాలని, విద్యార్థుల కష్టాలను తొలగించాలని గ్రామస్తులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

చదువు కోసం అడవుల్లో అష్టకష్టాలు

కొండలు, గుట్టలు దాటుతూరెండు కిలోమీటర్లు కాలినడకన బడికి..

వయ్యంపల్లి విద్యార్థులకు రహదారి కష్టాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement