● నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ అమిత్ బర్ధర్
అరకులోయ టౌన్ (డుంబ్రిగుడ): సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ల దాఖలు సమయంలో ఎన్నికల కమిషన్ విధించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్ సూచించారు. మంగళవారం అరకులోయ మండలంలోని సుంకరమెట్ట నామినేషన్ కేంద్రాలను అరకు సర్కిల్ సీఐ ఏ. కోటేశ్వరరావుతో కలిసి ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రం పరిసరాలు, ప్రహరీ గోడ, నామినేషన్ భవనం, గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. సుంకరమెట్ట పంచాయతీ సచివాలయ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. ఎన్నికల సమయంలో ప్రజాశాంతికి భంగం కలిగించే చర్యలకు ఎవరూ పాల్పడరాదని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో పోలీసు సిబ్బంది, పంచాయతీ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.


