● ఆదివాసీ రాజ్యాంగ హక్కుల సమాఖ్య కన్వీనర్ సొనాయి అప్పలరాజు
పాడేరు రూరల్: పోరాటాలతోనే ఆదివాసీల హక్కులు, చట్టాలను పరిరక్షించుకోవడం సాధ్యమని ఆదివాసీ రాజ్యాంగ హక్కుల సమాఖ్య కన్వీనర్ సొనాయి అప్పలరాజు అన్నారు. మంగళవారం అల్లూరి జిల్లా పాడేరు నుంచి 12 మందితో కూడిన ఆదివాసీ ప్రతినిధుల బృందం ఢిల్లీకి బయలుదేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కులు, చట్టాల పరిరక్షణతో పాటు రాజకీయ, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లకు సంబంధించిన పలు సమస్యల పరిష్కారం, హక్కుల సాధనే లక్ష్యంగా ఢిల్లీ పర్యటన చేపట్టినట్లు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రపతి, కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి, జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్‌ను కలిసి వినతిపత్రాలు అందజేయనున్నట్లు బృంద సభ్యులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కొక్కుల రామారావు, కిముడు రామారావు, బాకా సత్యారావు, బాకురు కరుణాకర్, లకే చిట్టిబాబు, రంజీత్‌కుమార్, భాస్కరరావు, రామనాయుడు పాల్గొన్నారు.


