సీడీపీవో సౌజన్య
చింతపల్లి: చిన్నారులకు తొలినుంచే అంగన్వాడీ కేంద్రాల ద్వారా నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తే ఆరోగ్యవంతమైన భవిష్యత్‌కు పునాది పడుతుందని ఇన్చార్జి సీడీపీవో సౌజన్య అన్నారు. మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలకు ‘పోషణ్ భీ, పడాయి భీ’ రెండో విడత శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం స్థానిక ఏకలవ్య పాఠశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యను బోధించాలన్నారు. తొలిరోజు శిక్షణలో ఐదేళ్లలోపు పిల్లల అభివృద్ధి దశలు, ఆటల ద్వారా విద్యాబోధన, ఇంటింటి సందర్శన ప్రాధాన్యత, తల్లిదండ్రుల భాగస్వామ్యం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గెస్ట్ ఫ్యాకల్టీలు దేపూరి శశికుమార్, కుడుముల వెంకటరమణ, ీసీనియర్ సహాయకులు శర్మ, సూపర్వైజర్లు జయభారతి, తులసి, లక్ష్మి, గౌరి పాల్గొన్నారు.
కొయ్యూరు: అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలని సీడీపీవో సత్యశ్రీ సూచించారు. పిల్లలకు అవసరమైన పద్ధతిలో అక్షరాలు నేర్పించాలన్నారు.ఆమె బుధవారం రాజేంద్రపాలెం బాలికల ఆశ్రమ పాఠశాలలో పోషణ్ భీ బడాయి భీ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాల్య సంరక్షణ కేంద్రాలుగా అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు విజయలక్ష్మి,రామలక్ష్మి,సత్యవతి, కనకమహాలక్ష్మి,బాలామణి,బీపీసీ సోమశేఖర్ పాల్గొన్నారు


