చోడవరం: స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ శ్రేణులన్నీ ఐక్యంగా పనిచేస్తున్నాయని ఆ పార్టీ సమన్వయకర్త, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణకు శుక్రవారం చివరి రోజు కావడంతో వైఎస్సార్సీపీ అభ్యర్థులు భారీ ఊరేగింపుగా వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. ముందుగా చోడవరంలోని పార్టీ కార్యాలయంలో అభ్యర్థుల నామినేషన్ పత్రాలను అమర్నాథ్ పరిశీలించి, వారికి పలు సూచనలు చేశారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి తీన్మార్ డప్పుల నడుమ భారీ ఊరేగింపుగా బయలుదేరిన అభ్యర్థులు, కార్యకర్తలు ప్రధాన రహదారి మీదుగా మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎంపీపీ అభ్యర్థి పల్లా నర్సింగరావుతోపాటు వివిధ ఎంపీటీసీ స్థానాల అభ్యర్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ విధానాలను స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అభ్యర్థిస్తామని తెలిపారు. వైఎస్సార్సీపీ తరఫున అన్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో అభ్యర్థులు పోటీ చేస్తున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన చర్యలకు పాల్పడితే ప్రజలే తగిన సమాధానం చెబుతారన్నారు. ఎంపీపీ అభ్యర్థి పల్లా నర్సింగరావు మాట్లాడుతూ గోవాడ చక్కెర కర్మాగారం మూసివేతకు టీడీపీ అభ్యర్థే ప్రధాన కారణమని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు, చోడవరం జెడ్పీటీసీ అభ్యర్థి దొడ్డి వెంకట్రావు(డీవీఆర్), రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి గూనూరు రామచంద్రనాయుడు, జిల్లా ప్రతినిధి మూడెడ్ల శంకరరావు, పుల్లేటి వెంకట్రావు, మండల అధ్యక్షుడు శరగడం చిమ్మినాయుడు, పట్టణ అధ్యక్షుడు దేవరపల్లి సత్య, జిల్లా యువజన అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్, రాష్ట్ర సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి పందిరి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.


