● నూరుశాతం స్థానాల్లో గెలుపే లక్ష్యం
● అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి
సాక్షి, పాడేరు: వచ్చేనెల 3న జరగనున్న స్థానిక ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో నూరుశాతం విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి వైఎస్సార్సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ హుకుంపేట జడ్పీటీసీ అభ్యర్థి ఒంటుబు ప్రియాంకతో పాటు పలు సెగ్మెంట్ల ఎంపీటీసీ అభ్యర్థులు మంగళవారం పాడేరులోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ వారందరికీ పుష్పగుచ్ఛాలు అందజేసి ఆత్మీయంగా అభినందించారు. ఎన్నికల్లో అధిక మెజార్టీతో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో విజయం సాధించి వైఎస్సార్సీపీ సత్తా చాటాలని అన్నారు. 2029లో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిని చేయాలనే లక్ష్య సాధనలో స్థానిక ఎన్నికలు కీలకమని పేర్కొన్నారు. గ్రామస్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ, అన్ని వర్గాల ప్రజల మద్దతుతో భారీ విజయం సాధించాలని కోరారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గిరిజన ప్రాంతంలో జరిగిన అభివృద్ధి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేత చెట్టి వినయ్, ఇతర నాయకులు, ఎంపీటీసీ అభ్యర్థులు పాల్గొన్నారు.


