ఘాట్‌ రహదారుల్లో రాకపోకలు బంద్‌ | - | Sakshi
Sakshi News home page

ఘాట్‌ రహదారుల్లో రాకపోకలు బంద్‌

Oct 28 2026 12:54 AM | Updated on Oct 28 2026 12:54 AM

పాడేరు: అర్నాబ్‌ తుపాను ప్రభావం నేపథ్యంలో జిల్లా ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అమిత్‌ బర్ధర్‌ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పాటు కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉందన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు ప్రాధాన్యమిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తుపాను కారణంగా జిల్లాలోని అన్ని ఘాట్‌ మార్గాల్లో అన్ని రకాల రాకపోకలను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని, అత్యవసరం కాని ప్రయాణాలను పూర్తిగా వాయిదా వేసుకోవాలని సూచించారు. పూరి గుడిసెలు, పాకలు, రేకుల షెడ్లు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, కొండచరియలు విరిగిపడే ప్రాంతాలు, వాగులు, వంకల సమీపంలో నివసించే వారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కోరారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, దివ్యాంగులు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని తెలిపారు. తుపానుపై ఎలాంటి అనధికారిక పుకార్లను నమ్మవద్దని, అధికారిక వాతావరణ హెచ్చరికలు, జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ సూచనలను మాత్రమే అనుసరించాలని ఎస్పీ స్పష్టం చేశారు. తుపాను కారణంగా ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే 112 లేదా పోలీసు కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 9281442977ను సంప్రదించాలని సూచించారు.

తుపానుపై అప్రమత్తంగా ఉన్నాం

కొయ్యూరు: తుపాను నేపథ్యంలో రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని సీఐ బి. శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం చింతాలమ్మ ఘాట్‌ రోడ్డులో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ప్రస్తుతం వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. రాత్రి వేళల్లో భారీ వాహనాలను నడపరాదని సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని, నిత్యావసరాలను సిద్ధంగా ఉంచుకోవాలని కోరారు. కాలువలు, జలాశయాల వద్దకు వెళ్లరాదని హెచ్చరించారు.

ఎస్పీ అమిత్‌బర్దర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement