● అర్నాబ్ తుపాను ప్రభావంతోభారీ వర్షాలు
● ప్రధాన గెడ్డలకు వరద తాకిడి
సాక్షి, పాడేరు: అర్నాబ్ తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఉదయం నుంచి కుండపోత వర్షం కురిసింది. జిల్లా కేంద్రం పాడేరుతో పాటు అన్ని మండలాల్లో భారీ వర్షం పడింది. రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. జి.మాడుగుల వారపుసంతకు ఆటంకం ఏర్పడింది. రహదారుల పక్కన దుకాణాలు ఏర్పాటు చేసుకున్న చిరువ్యాపారులు వర్షంతో అవస్థలు ఎదుర్కొన్నారు. మరోవైపు ఈదురుగాలుల తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పాడేరు, అనంతగిరి, లంబసింగి ఘాట్ రోడ్లలో ప్రయాణించే వాహనదారులు బలమైన గాలులతో భయాందోళనకు గురయ్యారు. ఏజెన్సీలోని ప్రధాన గెడ్డల్లో వరదనీటి ప్రవాహం పెరుగుతోంది.
కోత దశలో పంటలు..
ఖరీఫ్ సీజన్‌లో గిరిజన రైతులు సాగు చేసిన వరి, రాగులు, ఇతర చిరుధాన్యాల పంటలు ప్రస్తుతం కోత దశలో ఉన్నాయి. హుకుంపేట మండలం రంగశీల ప్రాంతంలో ముందస్తుగా వరి, చిరుధాన్యాల కోతలను ఇటీవల ప్రారంభించారు. అయితే భారీ వర్షాలకు వరి, ఇతర పంటలు తడిసిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పలుచోట్ల చోడి, సామలు, కొర్రల పంటలు నేలవాలాయి. కాయ దశలో ఉన్న రాజ్‌మా పంటతో పాటు, తిమ్మిరెలు, పూలతో కనువిందు చేస్తున్న వలిసె తోటలకు కూడా వర్షాలతో నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగశీల ప్రాంతంలో వరి పనల కుప్పలపై ప్లాస్టిక్ కవర్లు కప్పి రైతులు పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. లోతట్టు భూముల్లో పంటలు నీట మునగకుండా కాలువలు తవ్వుకుంటున్నారు.
అత్యవసర కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు
సాక్షి, పాడేరు: అర్నాబ్ తుపాన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని కలెక్టర్ టి.నిశాంతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు అధికారులు అప్రమత్తంగా ఉన్నారని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అత్యవసర సహాయక చర్యల కోసం కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. కలెక్టరేట్‌లో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్‌ను సంప్రదించి ప్రజలు అత్యవసర సమాచారాన్ని అందించాలని సూచించారు. ఇందుకోసం 08935–293448, 9281856953 నంబర్లను సంప్రదించాలని కోరారు.కలెక్టర్ నిశాంతి ఆదేశాలతో అరకులోయలోని గిరిజన మ్యూజియం,పద్మాపురం గార్డెన్,చాపరాయి, కొల్లాపుట్, కొత్తపల్లి జలపాతాల సందర్శనను నిలిపివేశారు. బొర్రాగుహలు మూతపడ్డాయి.తాజంగి రిజర్వాయర్‌లో బోటుషికారును రద్దు చేశారు.
జి.మాడుగుల: అర్నాబ్ తుపాను ప్రభావంతో మండలంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గెడ్డలు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. తుపాను ప్రభావం నేపథ్యంలో మంగళవారం సంతబయలు గ్రామంలో జరగాల్సిన వారపుసంతను అధికారులు రద్దు చేశారు. మండలంలోని కుంబిడిసింగి మార్గంలో సంగం గెడ్డ, కుడ్డంగి మార్గంలోని గెడ్డ, పోతురాజు గెడ్డ, దేవునిగెడ్డ, కొండగెడ్డలు వరద నీటితో ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కొత్తపల్లి జలపాతాన్ని వర్షాలు తగ్గే వరకు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఎస్‌ఐ సాయిరాంపడాల్ తెలిపారు. మండలంలో ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులతో వర్షాలు కురుస్తుండటంతో పాడేరు, చింతపల్లి, బోయితిలి, లువ్వాసింగి, సొలభం, గడుతూరు, గెమ్మెలి, జి.మాడుగుల–వంజరి, లంబసింగి రహదారుల్లో ద్విచక్రవాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాల కారణంగా మండలంలో జాతీయ రహదారి నిర్మాణ పనులతో పాటు పలు కాంట్రాక్టు పనులు నిలిచిపోయాయి.
పర్యాటక కేంద్రాల మూసివేత
డుంబ్రిగుడ: అర్నాబ్ తుపాను నేపథ్యంలో మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన చాపరాయి జలపాతం, అరకు పైనరీ, కొల్లాపుట్టు జలపాతంతో పాటు అక్కడి ఐటీడీఏ కాటేజీలను మంగళవారం నుంచి గురువారం వరకు మూసివేస్తున్నట్లు చాపరాయి ఇన్‌చార్జి అప్పారావు, పైనరీ మేనేజర్ శేఖర్ తెలిపారు. కలెక్టర్ నిషాంతి ఆదేశాల మేరకు ఐటీడీఏ, అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. తుపాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున పర్యాటకుల భద్రత దృష్ట్యా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. తుపాను ప్రభావం తగ్గిన తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పర్యాటకులను అనుమతిస్తామని తెలిపారు. పర్యాటకులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అరకు పర్యటనకు రావాలని వారు కోరారు.
సీలేరు: ఏజెన్సీ ఆంధ్రా–ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి వర్షం ప్రారంభమై క్రమంగా తీవ్రత పెరిగింది. దీంతో జీకే వీధి సీఐ సుధాకర్, ఎస్‌ఐ యాసీన్ అప్రమత్తమయ్యారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, అవసరమైతే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ఏపీ జెన్‌కో చెక్‌పోస్టు వద్ద బలగాలతో భద్రతా చర్యలు చేపట్టారు. తుపాన్ నేపథ్యంలో విశాఖపట్నం నుంచి అంతర్రాష్ట్ర మార్గంలో రాత్రిపూట నడిచే బస్సు సర్వీసులను ఆర్టీసీ అధికారులు నిలిపివేశారు. అర్ధరాత్రి వేళల్లో ఘాట్ రోడ్లపై ప్రయాణించవద్దని పోలీసులు హెచ్చరించారు.
సీలేరు: గూడెంకొత్తవీధి మండలం ధారకొండ, గుమ్మిరేవుల పంచాయతీల పరిధిలోని తుపాన్ ప్రభావిత ప్రాంతాలను చింతపల్లి ఏఎస్పీ జాదవ్ రావు నిరంజన్ మహేంద్ర సిన్హా మంగళవారం పరిశీలించారు. గత సెప్టెంబరులో భారీ వర్షాలకు రెండుసార్లు కొట్టుకుపోయిన గంగవరం తాత్కాలిక వంతెనను పరిశీలించి, అవతల ఉన్న గ్రామాల వివరాలను సీఐ సుధాకర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాదిమళ్లులు వంతెనను, ధారకొండ పంచాయతీ పరిధిలోని తోకరాయి గ్రామాన్ని సందర్శించారు. అర్నాబ్ తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించి, ధారకొండలోని పునరావాస కేంద్రానికి చేర్చే చర్యలు చేపట్టారు. గంగవరం వంతెన అవతల గ్రామాల్లోని గర్భిణులను ముందుగానే ధారకొండ పీహెచ్‌సీకి తరలించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఘాట్ రోడ్డులో అనవసర ప్రయాణాలు చేయవద్దని, ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ సుధాకర్, సీలేరు ఎస్‌ఐ ఎండీ యాసిన్ పాల్గొన్నారు.
మూడు గ్రామాలు జలదిగ్బంధం
ముంచంగిపుట్టు: మండలంలోని 23 పంచాయతీల్లో అర్నాబ్ తుపాను ప్రభావంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వాగులు, గెడ్డలు వరదనీటితో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మండల కేంద్రం నుంచి కర్రిముఖిపుట్టు, బూసిపుట్టు వెళ్లే మార్గంలో తుడుమురాయి, కర్రిముఖిపుట్టు గ్రామాల వద్ద కల్వర్టులపై నుంచి వరదనీరు ప్రవహించడంతో గిరిజనులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని తుమ్మిడిపుట్టు, ఉబ్బెంగుల, కర్లపొదర్ గ్రామాల చుట్టూ వాగులు ఉధృతంగా ప్రవహించడంతో మూడు గ్రామాల గిరిజనులు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. దీంతో గ్రామాలకే పరిమితం కావాల్సి వచ్చింది.


