పూల సాగుతో ఆదాయం పొందాలనుకున్న గిరిజన మహిళా రైతులకు ఈ ఏడాది నిరాశే ఎదురవుతోంది. ఓవైపు గిట్టుబాటు ధర లేక.. మరోవైపు తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో బంతిపూల రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. బుట్ట పూల ధర రూ.20 నుంచి రూ.10కి పడిపోవడంతో వారి కష్టం నీటిపాలవుతోంది.
సాక్షి, పాడేరు: ఏజెన్సీలో గిరిజన మహిళా రైతులు ప్రత్యేకంగా సాగు చేస్తున్న సీతమ్మ కాటుక రకం బంతిపూలకు కనీస గిట్టుబాటు ధర కరువైంది. సోమవారం వరకు బుట్ట పూలను రూ.20 చొప్పున కొనుగోలు చేసిన వ్యాపారులు.. అర్నాబ్ తుపాను ప్రభావంతో మంగళవారం బుట్టకు రూ.10 మాత్రమే చెల్లించారు. గత ఐదు రోజులుగా బంతిపూల బుట్టకు రూ.20కు మించి ధర పలకకపోవడంతో ఉసూరుమంటున్న గిరిజన మహిళా రైతులకు వర్షం మరింత నష్టాన్ని మిగిల్చింది.
ఆశించిన ఆదాయం లేక..
పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు మండలాల్లోని అనేక గ్రామాల్లో గిరిజన మహిళలు పూర్వం నుంచి బంతిపూల సాగు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది బంతిపూల సాగు వారికి ఆశించిన ఆదాయాన్ని అందించలేకపోతోంది. మైదాన ప్రాంతాల్లో డిమాండ్ లేదనే కారణంతో వ్యాపారులు కొనుగోలుకు ముందుకు రావడం లేదు. మరోవైపు అర్నాబ్ తుపాను ప్రభావంతోనూ పూల కొనుగోళ్లకు వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. గిరిజన మహిళలు బతిమాలడంతో వ్యాపారులు బుట్ట పూలను రూ.10 చొప్పున కొనుగోలు చేశారు. వర్షంలో తడుచుకుంటూ పూలను తీసుకొచ్చిన గిరిజన మహిళా రైతులు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
గిట్టుబాటు ధర లేక నష్టాలు
గిరిజన మహిళలకు నిరాశ
తుపానుతో మరింత నష్టం
కష్టానికి దక్కని ప్రతిఫలం
ధర లేక గిరి రైతుల ఆవేదన
చాలా దారుణం
బుట్ట బంతిపూలను రూ.10తో వ్యాపారులు కొనడం దారు ణం. బంతిపూలను సేకరించి, వాటిని దూరంగా ఉన్న పాడేరు మార్కెట్‌కు మోసుకురావడానికి అష్టకష్టాలు పడుతున్నాం. తీరా ఇక్కడ వ్యాపారులు కనీసం బుట్ట పూలను రూ.50కు కూడా కొనకపోవడంతో నష్టపోతున్నాం. బుట్ట రూ.10కు మించి ధర చెల్లించకపోవడంవల్ల తీవ్రంగా నష్టపోతున్నాం.
– జి.సీతమ్మ, పూల రైతు, రాములపుట్టు, పాడేరు మండలం


