పొత్తు నొప్పులు..! | - | Sakshi
Sakshi News home page

పొత్తు నొప్పులు..!

Oct 27 2026 1:08 AM | Updated on Oct 27 2026 1:08 AM

కూటమిలో వీడని సీట్ల పంచాయితీ

జెడ్పీ చైర్మన్‌ పీఠంపై జనసేన కన్ను

ఇప్పటికే 9 స్థానాల్లో నామినేషన్లు

పోటీగా 8 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు

టీడీపీకి భంగపాటు తప్పదా?

పాడేరులోనూ టీడీపీకి జనసేన నుంచి పోటీ

సాక్షి, పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవిపై కూటమిలో విభేదాలు ముదురుతున్నాయా? ప్రస్తుత పరిణామాలను బట్టి అవుననే సమాధానం వినిపిస్తోంది. జెడ్పీ పీఠాన్ని దక్కించుకోవాలని టీడీపీ ఆశిస్తుండగా.. పొత్తు ధర్మంలో భాగంగా ఆ పదవిని జనసేన కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీజేపీ కూడా పలు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించడంతో కూటమి పార్టీల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాలు టీడీపీ ఆశలపై నీళ్లు చల్లేలా ఉన్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌.. జెడ్పీ చైర్మన్‌ పదవిని తమ పార్టీకి కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ నాగబాబు అరకులోయలో పర్యటించి జనసేన నాయకులతో సమావేశం నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లా పరిషత్‌ పీఠాన్ని జనసేనకు కేటాయించాలన్న డిమాండ్‌ను పార్టీ నేతలు నాగబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని ఆయన పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

టీడీపీ స్థానాల్లోనూ జనసేన పోటీ

ముందస్తు వ్యూహంలో భాగంగా జనసేన అభ్యర్థులు ఇప్పటికే తొమ్మిది జెడ్పీటీసీ స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్న స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులు పోటీకి దిగడం ఆ పార్టీ నాయకత్వానికి ఇబ్బందికరంగా మారింది. మరోవైపు బీజేపీ సైతం పాడేరుతో సహా ఎనిమిది స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేసింది. దీంతో మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదన్న విషయం స్పష్టమవుతోంది.

గిడ్డి ఈశ్వరి ఆశలపై నీలినీడలు

టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి తన కుమార్తె కీర్తి మధుమితను జెడ్పీ చైర్‌పర్సన్‌గా చూడాలనే ఆశతో ఆమెను పాడేరు జెడ్పీటీసీ అభ్యర్థిగా బరిలోకి దించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ప్రచార రథంతో పాటు ఎన్నికల సామగ్రిని కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే జెడ్పీ చైర్మన్‌ పదవి ఎస్టీ జనరల్‌కు రిజర్వు కావడంతో, ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే గిడ్డి ఈశ్వరి కుటుంబం ఆశలపై నీళ్లు చల్లినట్లేనని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. పాడేరుతో పాటు పలు జెడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన చోట జనసేన అభ్యర్థులు కూడా బరిలో ఉండటంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. సోమవారం మూడు పార్టీల నుంచి నామినేషన్ల ఉపసంహరణలు జరగకపోవడం, ఇప్పటి వరకు బీ–ఫారాల పంపిణీ పూర్తి కాకపోవడం ఉత్కంఠను పెంచుతోంది.

నేడు తేలనున్న లెక్కలు!

నామినేషన్ల ఉపసంహరణకు, బీ–ఫారాల సమర్పణకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉండటంతో చివరి నిమిషంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఎలా జరుగుతుంది? జనసేన డిమాండ్‌కు టీడీపీ అధిష్టానం అంగీకరిస్తుందా? అన్న ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి. అధిక జెడ్పీటీసీ స్థానాలతో పాటు జెడ్పీ చైర్మన్‌ పీఠాన్ని కూడా టీడీపీ దక్కించుకోవడం కష్టమేనన్న ప్రచారం జిల్లాలో జోరందుకుంది.

జోరు పెంచిన వైఎస్సార్‌సీపీ

మరోవైపు వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థులు బీ–ఫారాలను అధికారులకు అందజేసి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. జిల్లాలోని అన్ని మండలాల్లో జెడ్పీటీసీ స్థానాలపై దృష్టి సారించిన పార్టీ నాయకత్వం.. అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తోంది. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఆదరణ తమకు కలిసివస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. జెడ్పీటీసీ స్థానాల్లో మెజారిటీ సాధించడంతో పాటు జెడ్పీ చైర్మన్‌ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement