చింతపల్లి: మన్యం అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోందని, గిరిజన సమస్యలను పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు పసుపులేటి బాలరాజు విమర్శించారు. కూటమి ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మద్దతు లభిస్తుందన్నారు. సోమవారం సాయంత్రం చింతపల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం ఆదుకునే చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, అనంతరం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గిరిజన ప్రాంతాన్ని సొంత ప్రాంతంగా భావించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. ఇటీవల తుపాను ప్రభావంతో మారుమూల గ్రామాల్లో ప్రజలు తీవ్రంగా నష్టపోయినా, రహదారుల సమస్యలు తలెత్తినా పరిష్కారానికి చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమైందని విమర్శించారు. జీకే వీధి మండలం సట్రాయిపల్లిలో ఏడాదిన్నర క్రితం ప్రకృతి వైపరీత్యంతో సర్వం కోల్పోయిన బాధితులకు ఇప్పటివరకు సహాయం అందలేదని ఆరోపించారు. ఇటీవల తుపాను కారణంగా నష్టపోయిన గిరిజనులను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి స్థానిక ఎన్నికల్లో ప్రతిబింబిస్తుందని, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించి జిల్లా, మండల పరిషత్‌లను కై వసం చేసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో తాజా మాజీ జెడ్పీటీసీ పోతురాజు బాలయ్యపడాల్, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి బూసరి కృష్ణారావు, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు మోరి రవి, నాయకుడు చంటి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బాలరాజు


