సాక్షి, పాడేరు: వర్షాభావ పరిస్థితుల మధ్య ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఖరీఫ్ సాగు చేపట్టిన గిరిజన రైతులను అర్నాబ్ తుపాను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం వరి, చిరుధాన్యాల పంటలు కోత దశకు చేరుకోవడంతో భారీ వర్షాలు కురిస్తే తీవ్రంగా నష్టపోతామని రైతులు కలవరపడుతున్నారు.
కోత దశలో ఖరీఫ్ పంటలు
జిల్లాలోని 11 మండలాల పరిధిలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 42,427 హెక్టార్లలో వరి, 15,217 హెక్టార్లలో రాగులు, 4,658 హెక్టార్లలో సామలు, కొర్రలు వంటి చిరుధాన్యాలను గిరిజన రైతులు సాగు చేశారు. ముందుగా నాట్లు వేసిన ప్రాంతాల్లో పంటలు కోత దశకు చేరుకోగా, సాగునీటి సమస్యలతో ఆలస్యమైన చోట్ల ఇంకా ఎదుగుదల దశలోనే ఉన్నాయి. వరి పంట గిరిజన కుటుంబాలకు ప్రధాన ఆహార వనరు కాగా, చిరుధాన్యాలు ఆర్థికంగా తోడ్పడుతున్నాయి. ఈ తరుణంలో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయన్న సమాచారంతో రైతులు అప్రమత్తమవుతున్నారు. లోతట్టు పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా కాల్వలు తవ్వుతున్నారు. పంటలు నీట మునిగితే దిగుబడులు దెబ్బతినడంతో పాటు ధాన్యం సేకరణలోనూ ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన చెందుతున్నారు.
భారీ వర్షాలు కురిస్తే అపార నష్టం
పంటలు ఆశాజనకంగా ఎదుగుతున్నాయి. కోత దశకు చేరుకుంటున్న సమయంలో భారీ వర్షాలు కురిస్తే పంటలకు ఆపార నష్టం కలుగుతుంది. ఇప్పటిప్పుడు వరి పంటను కోసి దాచుకునే సౌకర్యాలు మా వద్ద లేవు. తుపాను తీవ్రత ఎక్కువగా ఉంటే తిండి గింజలకూ తీవ్ర ఇబ్బందులు పడిపోతాం.
–కిల్లో కోటిబాబు, గిరిజన రైతు, పాటిమామిడి, హుకుంపేట మండలం
ఏజెన్సీలో ఖరీఫ్‌లో సాగైన పంటల వివరాలు
పంట సాగు
(హెక్టార్లలో..)
వరి 42,427
రాగులు 15,217
చిరుధాన్యాలు 4,658


