ఆదమరిస్తే
ముంచంగిపుట్టు: జిల్లాలో కనువిందు చేసే జలపాతాలు ఎన్నో ఉన్నాయి. వర్షాకాలంలో కొండలపై నుంచి జలనిధి జాలువారుతూ మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ప్రకృతి సోయగాలు తిలకించేందుకు, జలపాతాల సవ్వడులను ఆస్వాదించేందుకు దేశ,విదేశాల నుంచి సందర్శకులు వస్తుంటారు. ఈ విహార యాత్రలు కొత్త సంవత్సరం ప్రారంభం వరకు కొనసాగుతాయి. కొత్త ప్రదేశాలను చూసి తన్మయత్వానికి లోనవ్వ డమే కాకుండా అక్కడి పరిస్థితులపై అవగాహన లేక ఈతకు దిగి ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు ఫొటోలు, సెల్ఫీల కోసం సాహసాలు చేస్తూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. వీరిలో యువతే ఎక్కువగా ఉంటున్నారు.
● ముంచంగిపుట్టు మండలంలో ఆంధ్ర,ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో ఉన్న డుడుమ జలపాతం 556 అడుగుల పైనుంచి జాలువారుతుంది. దగ్గరకు వెళ్లడమంటే కాస్త ప్రమాదంతో కూడుకున్నదే. జలపాతం వద్దకు వెళ్లాలంటే 800 మెట్లు దిగాలి. నీటి ప్రవాహం వల్ల జలపాతం కింద భాగంలో రాళ్లు కోతకు గురై సొరంగాలు ఏర్పడ్డాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే. ఈ జలపాతం వద్ద ఇప్పటికే అనేకమంది మృత్యువాత పడ్డారు. మండలంలో తారబు, జడిగూడ,బురదగుంట,హంసబంద జలపాతాల వద్ద సైతం ప్రమాదాలు పొంచి ఉన్నాయి.
● అనంతగిరి మండలంలో సరియా, కటికి, తాటిగూడ, డుంబ్రిగుడ మండలంలో చాపరాయి, అరకులోయలో రణజిల్లెడ, జి.మాడుగులలో కొత్తపల్లి, పెదబయలులో పిట్టలబొర్ర, తారబు, చింతపల్లిలో లంబసింగి సమీపంలో రావిమానుపాకలు, గాదిగుమ్మి వంటి పలు జలపాతాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. అయితే వీటిని చూసేందుకు వెళ్లిన వారు అజాగ్రత్త కారణంగా ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రభుత్వం,పర్యాటక శాఖ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు లెక్కచేయకుండా ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో విహారయాత్ర విషాదాన్ని మిగులుస్తోంది. కొన్ని జలపాతాల వద్ద స్థానిక గిరిజనులే ప్రహారా కాస్తూ పర్యాటకులను హెచ్చరిస్తున్నా లెక్కచేయకుండా వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నీళ్లు అధికంగా ప్రవహిస్తున్న జలపాతాల వద్ద స్నానం చేయకూడదు. సెల్ఫీ కోసం ఎత్తైన బండ రాళ్లపై ఎక్కకూడదు. బండరాళ్లపై నిరంతరం నీళ్లు ప్రవహిస్తూ ఉండటం వల్ల అవి నాచు పట్టి జారుగా ఉంటాయి. వర్షాలు అధికంగా పడుతున్న సమయంలో జలపాతాల వద్దకు వెళ్లకపోవడమే మేలు. పర్యాటక శాఖ అధికారుల సూచనలు పాటించాలి. ఈత వస్తే తప్ప జలపాతంలో దిగడానికి సాహసించరాదు. మద్యానికి దూరంగా ఉండడం ఎంతో ఉత్తమం. జలపాతాల వద్దకు ఒంటరిగా కాకుండా గుంపులుగానే వెళ్లాలి.
డుడుమ వద్ద గల్లంతైన వారి కోసం గాలిస్తున్న ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం (ఫైల్)
జాగ్రత్తలు పాటించాలి
జలపాతాలలో ప్రమాదాలు జరిగే ప్రదేశాల వద్ద హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వాటిని పట్టించుకోకపోవడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. జలపాతాలను సందర్శించేందుకు వెళ్లే పర్యాటకులు అన్ని జాగ్రత్తలు పాటించాలి.
– ఎస్.లక్ష్మణరావు, సీఐ, జి.మాడుగుల


