పాడేరు: జిల్లా వ్యాప్తంగా అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు సకాలంలో పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టి.నిశాంతి అధికారులను ఆదేశించారు. జిల్లాలో వ్యవసాయం, ఉద్యానవన, పశుసంవర్ధక, కాఫీ శాఖ, మత్స్యశాఖ, సెరికల్చర్, ఏపీఏంఐపీ తదితర శాఖలతో ప్రాథమిక రంగాల అభివృద్ధి, అమలులో ఉన్న ప్రభుత్వ సంక్షేమ పథకాల పురోగతిపై తన చాంబర్‌లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారులకు, రైతులకు అందుతున్న పఽథకాలు, ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు వాటి పరిష్కార మార్గాలపై అధికారులతో చర్చించారు. ప్రాథమిక రంగాలను మరింత బలోపేతం చేసేందుకు శాఖల వారీగా కార్యాచరణ రూపొందించి క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలని ఆదేశించారు. లబ్ధిదారులకు పథకాల ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తూ జాప్యం లేకుండా పర్యవేక్షించాలన్నారు. ఐవీఆర్‌ఎస్ కాల్స్‌కు సంబంధించిన అంశాలపై రైతులందరికీ అవగాహన కల్పించాలని, రైతులు స్పందించేలా క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్.బి. నంద్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కర్ణ, జిల్లా సెరికల్చర్ అధికారి రాజేంద్రప్రసాద్, కాఫీ బోర్డు ఏడీ జయంత్, పశు సంవర్ధక శాఖ అధికారి కరుణాకర్, మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
రీసర్వే వేగవంతం
రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని, పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కారించాలని కలెక్టర్ టి.నిశాంతి అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ప్రజలకు రెవెన్యూ సేవలను మరింత పారదర్శకంగా నిర్ణీత సమయంలో అందించేందుకు అధికార యంత్రాంగం సమన్వయంతో పని చేస్తుందన్నారు. జిల్లాలో 1400 గ్రామాల్లో మూడు విడతలుగా రీసర్వే చేపడుతున్నామని, రీసర్వే సమర్థంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. రెవెన్యూ రికార్డులను సక్రమంగా నిర్వహించడంతో పాటు వాటి భద్రతకు డిజిటలైజేషన్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. పీజీఆర్‌ఎస్ ద్వారా అందుతున్న భూ సంబంధిత అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కారించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ, అసైన్డ్ భూముల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మ్యుటేషన్లు, ఆర్‌వోఆర్ ప్రక్రియలో ఎటువంటి జాప్యం లేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో లోకేశ్వరరావు, మండల రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ నిశాంతి


