ఊరుకోం! | - | Sakshi
Sakshi News home page

ఊరుకోం!

Jul 18 2026 3:47 AM | Updated on Jul 18 2026 3:47 AM

మా గడ్డ.. మా హక్కు! చట్టాలను కాలరాస్తే చూస్తూ ఊరుకోం!.. అంటూ మన్యం గర్జించింది. ఆదివాసీల ఆత్మగౌరవాన్ని, చట్టబద్ధమైన హక్కులను కాపాడాలనే నినాదంతో వేలాది మంది గిరిజనులు జిల్లా కేంద్రం పాడేరులో కదం తొక్కారు. సామాజిక మాధ్యమాల ద్వారా పిలుపుతో తండోపతండాలుగా తరలివచ్చిన గిరిజన సైన్యం, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ నిరసన ప్రదర్శన.. అధికార వర్గాల వెన్నులో వణుకు పుట్టించింది. 1/70 చట్టం మొదలుకుని, జీవో నంబరు 3 పునరుద్ధరణ వరకు.. తమ డిమాండ్ల సాధనలో రాజీ లేదని గిరిజన సమాజం ప్రభుత్వాలకు స్పష్టం చేసింది.
గిరిజన చట్టాలను కాలరాస్తే
ప్రభుత్వాలను హెచ్చరించిన ఆదివాసీలు

పాడేరు: హక్కుల పరిరక్షణ కోసం.. చట్టాల అమలు కోసం.. తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం గిరిజన సమాజం ఒక్కటిగా రోడ్డెక్కింది. జిల్లా కేంద్రమైన పాడేరు గురువారం వేలాది మంది గిరిజనులతో కిక్కిరిసిపోయింది. జిల్లా నలుమూలల నుంచి తండోపతండాలుగా తరలివచ్చిన గిరిజనులు తమ డిమాండ్లను ముక్తకంఠంతో వినిపిస్తూ చేపట్టిన భారీ నిరసన స్థానికంగానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జల్‌–జంగల్‌–జమీన్‌ మా హక్కు.. 1/70 అమలు చేయాలి.. జీవో నెం.3 పునరుద్ధరించాలి.. అంటూ నినాదాలతో పాడేరు హోరెత్తింది. గిరిజన సోషల్‌ మీడియా కంటెంట్‌ క్రియేటర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు ఇచ్చిన ఒక్క పిలుపుకే వేలాదిగా స్పందించిన గిరిజనులు స్వచ్ఛందంగా తరలిరావడం అధికార యంత్రాంగాన్ని, పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఎలాంటి రాజకీయ పార్టీలు, సంస్థల ఆధ్వర్యం లేకుండానే సామాజిక మాధ్యమాల ద్వారా ఇంత పెద్ద ఎత్తున గిరిజన సమీకరణ జరగడం విశేషంగా నిలిచింది. గిరిజన ప్రాంతాల్లో బాకై ్సట్‌ సహా ఇతర ఖనిజాల తవ్వకాలకు, హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి శాశ్వతంగా స్వస్తి పలకాలని ఈ సందర్భంగా గిరిజనులు హెచ్చరించారు.

ుూడు గంటలు మహాధర్నా

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానం నుంచి ప్రారంభమైన ఈ భారీ ర్యాలీ గోల్డ్‌ షాప్‌ సెంటర్‌, మెయిన్‌ బజార్‌, అంబేడ్కర్‌ సెంటర్‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌ మీదుగా ఐటీడీఏ కార్యాలయం వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర సాగింది. ఐటీడీఏ వద్ద గిరిజనులు సుమారు మూడు గంటల పాటు మహాధర్నా చేపట్టారు. ఈ ఉద్యమానికి వైఎస్సార్‌సీపీ, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్‌ పార్టీలతో పాటు .వివిధ ప్రజా, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. డిమాండ్లు తెలియజేసేందుకు ఐటీడీఏలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, ఆందోళన కారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.

అధికారుల హామీ : జిల్లా కలెక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో, జాయింట్‌ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ ధర్నా స్థలానికి వచ్చి గిరిజనుల వినతులను స్వీకరించారు. అధికారులను రోడ్డుపైనే నిలదీస్తూ గిరిజనులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీవోలు మాట్లాడుతూ 1/70 చట్టం అమలుకు త్వరలోనే గిరిజన సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని, ఇతర డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. అనంతరం గిరిజనులు ఐటీడీఏ ఎదుట బహిరంగ సభ నిర్వహించి, భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు.

భవిష్యత్‌ కార్యాచరణ

ఈనెల 20న రంపచోడవరంలో బహిరంగ సభ, 22న ఉద్యమ సమీక్ష, 24న రంపచోడవరంలో సీఎం చంద్రబాబు సభ

దేశ రాజధాని స్థాయిలో ఉద్యమిస్తాం

అరకు ఎంపీ డాక్టర్‌ గుమ్మా తనూజరాణి

గిరిజనులకు అన్యాయం జరిగేలా వైఎస్సార్‌సీపీ చేయదు. నిత్యం గిరిజనుల పక్షాన ఉంటూ వారి సమస్యల సాధన కోసం ఉద్యమిస్తాం. వైఎస్సార్‌సీపీ తరఫున పార్లమెంట్‌లో ఇప్పటికి ఎనిమిది సార్లు జీవో నంబరు3, 1/70 చట్టంపై గళం వినిపించా. గిరిజన ప్రాంతంలో గిరిజన చట్టాలు, హక్కులు పరిరక్షించాలి. 1/70 చట్టం పటిష్టంగా అమలు కోసం అవసరమైతే దేశ రాజధానిలో పార్లమెంట్‌ ఎదుట జంతర్‌మంతర్‌ వద్ద మహాధర్నా నిర్వహిస్తాం. కూటమి ప్రభుత్వం ఇకనైన గిరిజనుల సమస్యల పరిష్కారంపై చర్యలు తీసుకోవాలి.

గిరిజనం కోసం పదవిని త్యాగం చేస్తా

మత్స్యరాస విశ్వేశ్వరరాజు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే

వైఎస్సార్‌సీపీ గిరిజనుల పక్షపాతి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గిరిజనులను నమ్మక ద్రోహం చేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో వేలాదిగా తరలివచ్చిన గిరిజనులను చూస్తూ అర్థమవుతుంది. తాము మొదటి నుంచి గిరిజనుల పక్షాన ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. భవిష్యత్‌లో కూడా మరింతగా శాంతియుత ఉద్యమాలు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు నష్టం చేకూర్చే ఏ ప్రయత్నం చేసిన తాను తన పదవికి రాజీనామా చేసి గిరిజనుల పక్షాన నిలబడుతా.

గిరిజనుల సత్తా ఏంటో చూపిస్తాం

పి. అప్పలనర్స, జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఆదివాసీ గిరిజన సంఘం

సీఎం చంద్రబాబు అరకు ఎన్నికల సభకు వచ్చి ఓట్ల కోసం గిరిజనులకు అనేక హామీలు ఇచ్చారు. అధికారంలోకి వస్తే జీవో నంబర్‌.3 పునరుద్ధరణ లేదా ప్రత్యామ్నాయ జీవో తెస్తామన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్నా ఇచ్చిన హమీపై అతీగతి లేదు. దీంతో గిరిజన నిరుద్యోగ యువత తమ హక్కుగా ఉన్న ఉద్యోగాలకు కోల్పోవాల్సి వస్తోంది. 1/70 చట్టం పూర్తిగా నీరుగారిపోయింది. ఎల్‌టీఆర్‌ కేసులు నమోదు చేయడం లేదు. బినామీ పేర్లతో గిరిజన ప్రాంతమంతా అన్యాక్రాంతమవుతోంది. అధికారులు చట్టాలను అమలు చేయకుండా ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. విశాఖపట్నం నుంచి వేరైన జిల్లాను జోన్‌–2లో చేర్చి ఆదివాసీలకు తీవ్ర అన్యాయం చేశారు. ఈనెల 24న రంపచోడవరం వస్తున్న సీఎం చంద్రబాబు గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం స్పష్టమైన ప్రకటన చేయాలి. లేదంటే పోరాటం ఉధృతం చేస్తాం. గిరిజను సత్తా ఏంటో చూపిస్తాం.

హక్కులు, చట్టాలపై ఉద్యమం సబబే

బైరీ నరేష్‌, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వ్యవస్థాపకుడు,

అంబేడ్కరిస్టు, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు

పాలకులు గిరిజన వర్గాల అభ్యున్నతిని పూర్తిగా విస్మరిస్తున్నారు. గిరిజనుల కోసం రాజ్యాంగంలో కల్పించిన హక్కులు, చట్టాలను ఏ మాత్రం కూడా అమలు చేయడం లేదు. దీంతో గిరిజనులు నేటికి భూమి, భుక్తి కోసం పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఉన్న చట్టాలను ఎందుకు అమలు చేయడం లేదనేది ప్రతి ఒక్కరి ప్రశ్న. పొట్టికూటి కోసం వ్యాపారాల కోసం గిరిజన ప్రాంతానికి వలస వస్తున్న గిరిజనేతరులు రోజురోజుకు గిరిజన భూభాగాన్ని ఆక్రమించుకొని అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు. ఏకంగా ఓ గిరిజనేతర మహిళ తన పేరిట దర్జాగా ఏడు భవంతులు గిరిజన ప్రాంతంలో నిర్మించిందంటే ఇక్కడ చట్టాలు ఏ మేరకు అమలవుతున్నాయో అర్థమవుతుంది. చట్టాలను పరిరక్షించి గిరిజనుల పక్షాన పోరాడాల్సిన అధికారులు ఎలా పాలిస్తున్నారో స్పష్టమవుతోంది. గిరిజనులు శాంతియుతంగా చేస్తున్న పోరాటాలు న్యాయమైనవి.

(మిగతా 2వ పేజీలో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement