ప్రజలను నిలువునా మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం
2029 ఎన్నికల్లో జగన్ సీఎం కావడం తథ్యం
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా
అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి
అరకులోయలో మహిళా సదస్సు
అరకులోయ: జగనన్న పాలనలోనే మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అత్యున్నత స్థానానికి ఎదిగారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. అరకులోయలో ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జరిగిన మహిళా సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చట్టసభల్లోనే కాకుండా నామినేటెడ్ పదవుల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిదేనన్నారు. ఆయన ప్రోత్సాహంతోనే ఎంతోమంది మహిళలు ఎమ్మెల్యేలుగా, జెడ్పీ చైర్మన్లుగా, సర్పంచ్‌లుగా బాధ్యతలు చేపట్టారని వివరించారు. బాబు ష్యూరిటీ–భవిష్యత్తు గ్యారంటీ అన్న చంద్రబాబు, రెండేళ్ల పాలనలో బూడిద గ్యారంటీతో ప్రజలను మోసం చేశారన్నారు. నిత్యావసర ధరల పెంపు, మహిళలపై దాడులు, లైంగిక దాడులతో రాష్ట్రం అరాచకానికి నిలయంగా మారిందని మండిపడ్డారు. హోం మంత్రి అనిత డమ్మీగా మిగిలారని విమర్శించారు. హోం మంత్రిగా ఆమె పూర్తిగా అన్‌ఫిట్ అని, మద్యం, గంజాయి, డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జగన్ విశ్వసనీయతకు, చంద్రబాబు వంచనకు మధ్య యుద్ధం మొదలైందని, కార్యకర్తలంతా చిరుతల్లా పోరాడి 2029లో జగనన్నను తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. 112కి కాల్ చేసినా పోలీసులు కనీసం 26 నిమిషాలైనా స్పందించడం లేదని, ఈ విషయంలో చంద్రబాబుతో పాటు హోం మంత్రి అనితను కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెచ్చరించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరగడానికి మద్యం, గంజాయి, డ్రగ్స్ ప్రధాన కారణాలని ఆమె ఆరోపించారు. గతంలో టీడీపీ హయాంలో సుగాలి ప్రీతి అనే గిరిజన యువతి హత్యకు గురైతే, చంద్రబాబు, పవన్ కల్యాణ్ కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. అల్లూరి జిల్లా జగనన్నకు పుట్టినిల్లు వంటిదని, బ్రిటిష్ వారిని గడగడలాడించిన ఈ గడ్డపై నుంచే ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దె దించే పోరాటం మొదలుపెడుతున్నామని ప్రకటించారు.
కూటమి పాలన ఖర్మయుగం: పుష్పశ్రీవాణి
మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి మాట్లాడుతూ, తూర్పుకనుమల్లోని గిరిజన మహిళలు గర్జిస్తే కూటమి నాయకుల చెవులు బద్దలవ్వాలని హెచ్చరించారు. రాజన్న రాజసం, రాయలసీమ పౌరుషం, మంచి మనస్సు కలిగిన అరుదైన నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని ఆమె కొనియాడారు. మహిళలకు నమ్మకమైన హామీలు ఇస్తామని చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, 2019–2024 వరకు సాగిన జగన్ పాలన ’స్వర్ణయుగం’ అయితే, ప్రస్తుత కూటమి పాలన ’ఖర్మయుగం’గా మారిందని విమర్శించారు.వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా జగనన్న మహిళలకు రూ. 26 వేల కోట్లు అందించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.2024 ఎన్నికల్లో మహిళల ఓట్లను ఆయుధంగా మలుచుకుని గెలిచిన చంద్రబాబు, ఆ తర్వాత 420 రకాల హామీలను విస్మరించారని ఆరోపించారు. హోం మంత్రి అనితకు మేకప్ మీద ఉన్న శ్రద్ధ, మహిళల రక్షణపై లేదని ఆమె ఘాటుగా విమర్శించారు.వైఎస్సార్‌సీపీ మహిళా విభాగాన్ని జగనన్న మరింత బలోపేతం చేస్తున్నారని, మహిళలందరూ ఐక్యంగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు.
కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరవు: జల్లిపల్లి సుభద్ర
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు భద్రత, రక్షణ కరువైందని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో మహిళల రక్షణ కవచంగా ఉన్న దిశ యాప్‌ను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆమె ఆరోపించారు. గతంలో జగన్ హయాంలో అల్లూరి జిల్లాకు ఎస్టీ కమిషన్ సభ్యులుగా, జీసీసీ కార్పొరేషన్ చైర్మన్‌గా గిరిజనులకు సముచిత స్థానం దక్కిందన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం రెండేళ్లలో ఏజెన్సీకి కేవలం రెండు మొక్కుబడి పదవులను మాత్రమే ఇచ్చి అవమానించిందని విమర్శించారు. కూటమి పాలనలో గిరిజన ప్రాంతాల్లో వైద్యం అందక మారుమూల గ్రామాల్లో ఇంకా డోలీ మోతలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జగన్ ప్రభుత్వం గర్భిణుల రక్షణ కోసం బర్త్ వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేసి, తల్లీబిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చేలా ప్రత్యేక చర్యలు తీసుకుందని గుర్తు చేశారు.
మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు, ఎమెల్సీ వరుదు కళ్యాణి, వేదికపై ఉమ్మడి జిల్లా చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ మంత్రి పుష్పశ్రీవాణి, ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, మహిళా ప్రజా ప్రతినిధులు
జగన్ 2.0 సూపర్ యాప్‌ను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి,
ఎంపీ గుమ్మా తనూజరాణి, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర,
మాజీ మంత్రి పుష్పశ్రీవాణి, ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, మహిళా ప్రజా ప్రతినిధులు
వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మహిళలకు ఆర్థిక భరోసాతో పాటు ఎంతో గౌరవాన్ని జగన్‌మోహన్‌రెడ్డి కల్పించారని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. మహిళలను నిలువునా ముంచే ప్రభుత్వం ప్రస్తుత కూటమి ప్రభుత్వమని ఆయన విమర్శించారు. గ్రామీణ స్థాయిలో కూటమి పార్టీలకు చెందిన చోటామోటా నాయకులు అరాచకాలు, దందాలు చేస్తున్నారని ఆరోపించారు. జగనన్న ప్రభుత్వ హయాంలో మంజూరైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసేందుకు, ప్రజలచే ఎన్నికై న వైఎస్సార్‌సీపీ నాయకులతో కూటమి నేతలు పోటీ పడుతున్నారని మండిపడ్డారు. గతంలో ఎపిడమిక్ సీజన్ సమయంలో గ్రామాల్లో ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసిన ఘనత జగన్‌దేనని గుర్తు చేశారు. నేడు ఆసుపత్రుల్లో మందులు లేక వందలాది మంది రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు, జగనన్న హయాంలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను గ్రామాల్లోని మహిళలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ఎస్టీసెల్ మహిళా అధ్యక్షురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ డుబుల్ ఇంజన్ సర్కార్ అని మోడీ, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను గ్రామాల్లో మహిళలే తెలియజేయాలన్నారు. అనంతరం అతిధులకు జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర దుశ్శాలువాలు కప్పి, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి, మాజీ ఎమ్మెల్యేలు శోభా హైమావతి దేవి, కళావతి, మాజీ జీసీసీ చైర్ పర్సన్ శోభా స్వాతిరాణి, ఉత్తరాంధ్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఈర్ల అనురాధ, ఉత్తరాంధ్ర జిల్లాల మహిళా విభాగం అధ్యక్షురాలు సుజాత, రమణ, పార్వతమ్మ, భారతి, పద్మజ, సత్యవతి, అరకు, పాడేరు మహిళా విభాగం అధ్యక్షురాలు పూర్ణిమ, ఊర్వశి, రాష్ట్ర మహిళ కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షులు శ్రీదేవి, పల్లా చినతల్లమ్మ, ప్రశాంతి, మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు లిల్లి సురేష్, రాములమ్మ, అనంతగిరి ఎంపీపీ టి. మిథుల, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


