సీలేరు చేరుకున్న హైదరాబాద్ యువకులు
సీలేరు: నేటి బిజీ లైఫ్, ఉద్యోగ ఒత్తిడి, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి సైక్లింగ్ ఉత్తమ మార్గమని హైదరాబాద్‌కు చెందిన నలుగురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు శ్రీనివాస్ శెట్టి, ప్రసాద్, భార్గవ్, కురందరన్ పిలుపునిచ్చారు. ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించేందుకు వారు హైదరాబాద్ నుంచి బయలుదేరి, మారెడుమిల్లి మీదుగా అటవీ ప్రాంతాల గుండా 94 కిలోమీటర్ల దూరాన్ని సైకిళ్లపై ప్రయాణించి సీలేరు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ప్రతి ఒక్కరూ కనీసం నెలకోసారి సైక్లింగ్ చేయడం అలవాటు చేసుకోవాలన్నారు. సైక్లింగ్ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడమే తమ లక్ష్యమని వారు పేర్కొన్నారు.
అనారోగ్యంతో విద్యార్థిని మృతి
డుంబ్రిగుడ: మండలంలోని కిల్లోగుడ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని మజ్జి కావ్యతేజశ్విని (11) అనారోగ్యంతో మృతి చెందింది. చంపగుడ గ్రామానికి చెందిన ఈ బాలిక పది రోజుల క్రితమే పాఠశాలలో చేరింది. వసతి గృహంలో ఉండగా జ్వరం రావడంతో, ఈనెల 11న తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లి ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించారు. కొద్దిరోజులకు బాలికకు తిరిగి జ్వరం రావడంతో అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో పాడేరు జిల్లా ఆసుపత్రికి, ఆపై మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. అంబులెన్స్‌లో విశాఖ తరలిస్తుండగా మార్గమధ్యంలోని చోడవరం వద్ద పరిస్థితి విషమించి బాలిక మృతి చెందినట్లు తండ్రి దామోదర్ తెలిపారు. శుక్రవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. చురుగ్గా ఉండే బాలిక ఇలా హఠాన్మరణం చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, ఇదే నెల 6న కేజీబీవీలో పదో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన మరువకముందే మరో విద్యార్థిని చనిపోవడం గిరిజన ప్రాంతాల్లో ఆందోళన కలిగిస్తోంది.


