జిల్లాలో జీడి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు, వ్యాపారుల సిండికేట్ మాయాజాలం మరోవైపు రైతును కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న జీడి తోటలు ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటివి, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ వెన్నెముక విస్మరణకు గురవుతోంది. ఒకప్పుడు జీడి సాగుతో ఆనందంగా ఉన్న రైతు, నేడు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. ప్రభుత్వం వెంటనే స్పందించి, గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు తూకాల్లో మోసాలను అరికట్టాలని జీడిమామిడి రైతులు కోరుతున్నారు.
పంట పండినా..
కొయ్యూరు: జిల్లాలో జీడిమామిడి అత్యధిక విస్తీర్ణంలో మండలంలోనే సాగవుతోంది. దాదాపు 28 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఇక్కడి వాతావరణం జీడి సాగుకు ఎంతో అనుకూలంగా ఉండటంతో, సుమారు 65 శాతం మంది రైతులు ప్రత్యక్షంగా దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుత ఏడాది పూత నుంచి పిందె దశకు పంట చేరుకోవడంతో దిగుబడి ఆశాజనకంగా ఉంటుందని రైతులు భావిస్తున్నారు.
● జీడి సాగులో అత్యంత కీలకమైనది పూత సమయం. అయితే, ప్రతి ఏటా ఇదే సమయంలో అకస్మాత్తుగా కురిసే పొగమంచు, అకాల వర్షాలు పూత మాడిపోయేలా చేస్తున్నాయి. దీనివల్ల ఆశించిన స్థాయిలో దిగుబడి రాక రైతులు పెట్టుబడి కూడా వెనక్కి తెచ్చుకోలేని పరిస్థితి ఎదురవుతోంది.
● పంట చేతికి వచ్చే సమయానికి వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలను అదుపు చేయడం జీడి రైతుకు శాపంగా మారింది.
గణాంకాలిలా..
2025: గతేడాది సీజన్ ఆరంభంలో 80 కిలోల బస్తా ధర రూ. 11 వేలు పలికింది. కానీ, వర్షాల సాకుతో వ్యాపారులు ఒక్కసారిగా కుమ్మకై ్క ధరను రూ. వెయ్యి నుంచి రూ.3వేలకు తగ్గించేశారు. చివరికి అది రూ. 7 వేలకు పడిపోయింది.
2024: ఈ ఏడాది 80 కిలోల బస్తా కనీసం రూ. 8వేలు కూడా దాటలేదు.
● ధర విషయంలోనే కాకుండా, తూకాల్లోనూ రైతులు నిలువునా మోసపోతున్నారు. 80 కిలోల బస్తా తూకంలో సంచి బరువు పేరుతో అదనంగా పిక్కలు వేయించుకోవడం ద్వారా రైతుకు తెలియకుండానే బస్తాకు 5 కిలోల వరకు నష్టం జరుగుతోంది. తూకం యంత్రాల వద్ద జరిగే మోసాలను అరికట్టే నాథుడే కరువయ్యారు.
ప్రభుత్వ సంస్థల నిర్లిప్తత
మన్యంలో కాఫీ, మిరియాలు వంటి పంటలను కొనుగోలు చేస్తున్న గిరిజన సహకార సంస్థ , జీడిపిక్కల కొనుగోలు విషయంలో మాత్రం ముందడుగు వేయడం లేదు. గతంలో కలెక్టర్ జీడి ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని సూచించినప్పటికీ, ఇప్పటివరకు అధికారులు దానిపై స్పందించకపోవడం గమనార్హం. ప్రభుత్వమే నేరుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే వ్యాపారుల సిండికేట్‌ను అడ్డుకోవచ్చని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం కాకరకపాడు సమీపంలో ఒక ప్రైవేటు సంస్థ జీడిపిక్కల ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల సుమారు 200 మంది మహిళలకు ఉపాధి లభించే అవకాశం ఉంది.
● కేవలం ప్రైవేటు సంస్థలకే పరిమితం కాకుండా, ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలను భాగస్వామ్యం చేస్తూ మండలంలో మరో 4 నుంచి 5 చోట్ల ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దీనివల్ల అటు తమకు గిట్టుబాటు ధర, ఇటు స్థానిక మహిళలకు శాశ్వత ఉపాధి దక్కుతాయని రైతులు కోరుతున్నారు.
నష్టపరుస్తున్న ప్రకృతి వైపరీత్యాలు మరోవైపు వ్యాపారుల మాయాజాలం
గిట్టుబాటు ధరపై తీవ్ర ప్రభావం అప్పుల ఊబిలో కూరుకుపోతున్న జీడిమామిడి రైతులు
చోద్యం చూస్తున్న గిరిజన సహకార సంస్థ
అనుకూలంగా వాతావరణం
ఈ ఏడాది వాతావరణం జీడి మామిడి తోటలకు చాలావరకు అనుకూలంగా ఉంది. పూత నుంచి పిందె దశకు వచ్చింది. అన్నిచోట్ల బాగుండే అవకాశం ఉంది. రైతులు అవసరమైన సమయంలో సస్యరక్షణ చర్యలు తీసుకుంటే సరిపోతుంది.
– కర్ణ, ఉద్యానవన అధికారి, కొయ్యూరు
గిట్టుబాటు ధర కల్పించాలి
జీడిమామిడి రైతులకు ప్రభు త్వం ధర తగ్గకుండా చూడాలి. కొన్ని సంవత్సరాలుగా సరైన ధర రాక ఆర్థికంగా దెబ్బతింటున్నాం. దీని మూలంగా నష్టాలు చవిచూస్తున్నాం. బస్తా పిక్కలు(80 కిలోలు) రూ.12 వేలు దాటి ధర పలికితేనే ప్రయోజనం ఉంటుంది.
– కనకరాజు, జీడిమామిడి రైతు, చింతలపూడి


