గూడెం కొత్తవీధి: మండలంలోని రంపుల జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో మూడు పశువులు మరణించాయి. వేగంగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఆవులను ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. రంపుల గ్రామానికి చెందిన కంకిపాటి గోవిందుకు చెందిన రెండు ఆవులు, బాలకృష్ణకు చెందిన ఒక ఆవు.. మొత్తం మూడు పశువులు జాతీయ రహదారిపై ఉండగా, అటుగా వస్తున్న రెండు బైకులు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మూడు ఆవులు అక్కడికక్కడే మరణించాయి. పశువులను ఢీకొట్టిన క్రమంలో ద్విచక్ర వాహనదారులు కిందపడి గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, వారిని చికిత్స నిమిత్తం పెదవలస ఆసుపత్రికి తరలించారు. తమ జీవనోపాధిగా ఉన్న పశువులు మరణించడంతో యజమానులు గోవిందు, బాలకృష్ణ కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం స్పందించి తమకు తగిన నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.
రోడ్లపైకి విడిచిపెడితే చర్యలు : రోడ్లపైకి విచ్చలవిడిగా పశువులను వదిలేస్తూ పరోక్షంగా రోడ్డుప్రమాదాలకు కారణం అవుతున్న పశువుల యజమానులపై చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ సురేష్ హెచ్చరించారు. ఇటీవల కాలంలో జాతీయ రహదారులపైకి పశువులను వాటి యజమానులు కట్టకుండా వదిలేస్తున్నారన్నారు. పగలూ, రాత్రి తేడా లేకుండా పశువులు రోడ్లపై తిరుగుతుండటంతో తరచూ వాహన ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వాటిని నియంత్రించని పక్షంలో పశువుల యజమానులను పిలిపించి వారిపై తగు చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
మృతి చెందిన ఆవులు
మూడు ఆవులు మృతి, ఇద్దరికి గాయాలు


