కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం
పాడేరు : అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో మొబైల్ కనెక్టివిటీ లేని ప్రాంతాల్లో సెల్ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు, అనుమతులు పొందిన చోట్ల సెల్ టవర్ల నిర్మాణాన్ని నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్ దినేష్ కుమార్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం పాడేరులోని తన క్యాంప్ కార్యాలయంనుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ, బీఎస్‌ఎన్‌ఎల్, జియో, అటవీశాఖ, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రెండు జిల్లాల్లో అనుమతులు పొందిన బీఎస్‌ఎన్‌ఎల్, జియో నెట్‌వర్క్ సంస్థలు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరిపి పనుల పురోగతిని తెలుసుకోవాలని సూచించారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని, గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
అర్జీలు, భూసమస్యలపై దృష్టి పెట్టండి
అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో నిర్వహిస్తున్న మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను, అలాగే రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా అందే భూ సమస్యల ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. నిర్ణీత కాలపరిమితిలోగా ఈ సమస్యలను పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు. గురువారం తన క్యాంప్ కార్యాలయం నుంచి రెండు జిల్లాల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. పీజీఆర్‌ఎస్‌లో పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులపై సుదీర్ఘంగా చర్చించారు. క్షేత్రస్థాయి అధికారులు అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ప్రజల పట్ల బాధ్యతయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒకే సమస్యపై ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని పేర్కొన్నారు. అనంతరం ఆర్టీసీ బస్సు కాంప్లెక్స్‌లలో మరుగుదొడ్ల సమస్య అధికంగా ఉందని, పరిసరాల అపరిశుభ్రతపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్టాండ్‌లను, డిపోలను శుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవోలు తిరుమణి శ్రీపూజ, స్మరణ్ రాజ్, శుభం నొఖ్వాల్, ఇన్‌చార్జి డీఆర్వో అంబేడ్కర్, పాడేరు ఇన్‌చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు పాల్గొన్నారు.


