సీలేరు: ఏపీ జెన్‌కో విద్యుత్ కాంప్లెక్స్ సీలేరులో నూతనంగా నిర్మించబోయే పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు పనుల దిశగా కీలక అడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నూతనంగా ఏర్పాటు చేసిన సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయాన్ని గురువారం కాంప్లెక్స్ చీఫ్ ఇంజనీర్ కేవీ రాజారావు ప్రారంభించారు. ప్రస్తుతం సీలేరులో ఉన్న సూపరింటెండెంట్ కార్యాలయ ఆవరణలోని ఒక భవనాన్ని సకల సౌకర్యాలతో ముస్తాబు చేసి, ఎస్‌ఈ బ్లాక్గా అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రారంభోత్సవ అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొత్త ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేసేందుకు త్వరలోనే మరిన్ని కార్యాలయాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ జాకీర్ హుస్సేన్, ఏడీలు పాపారావు, జైపాల్, ఏఈ సురేష్‌తో పాటు ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


