పెదబయలు: జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని సమగ్ర శిక్షా అభియాన్ జిల్లా అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ (ఏపీసీ) డాక్టర్ స్వామినాయుడు పిలుపునిచ్చారు. గురువారం ఆయన పెదబయలులోని జెడ్పీ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ కళాశాలను సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. పరీక్షలకు కేవలం 10 రోజుల సమయం మాత్రమే ఉన్నందున, 100 రోజుల ప్రణాళికను సద్వినియోగం చేసుకుని పట్టుదలతో చదవాలని విద్యార్థులకు మోటివేషన్ క్లాస్ తీసుకున్నారు.జిల్లాలో రూ. 40 లక్షల వ్యయంతో 29 కొత్త ప్రైమరీ స్కూల్ భవనాలు, 74 సింగిల్ టీచర్ పాఠశాలలకు భవనాలు, 18 కేజీబీవీ జూనియర్ కళాశాలలకు నూతన భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు.జిల్లాలో 10 కేజీబీవీ టైప్ త్రీ హాస్టళ్లను కార్పొరేట్ హంగులతో నిర్మిస్తున్నామని, ఒక్కో గదిలో నలుగురు విద్యార్థులు ఉండేలా వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. 53 పీఎం జన్‌మన్ హాస్టళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని, జూన్ పాఠశాలల పునఃప్రారంభం నాటికి వీటిని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం పెదబయలు జెడ్పీ హైస్కూల్ ఆవరణలో త్వరలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న బాలికల హాస్టల్ భవనాన్ని ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో పుష్ప జోసెఫ్, హెచ్‌ఎం శేషగిరిరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సమగ్ర శిక్షా అభియాన్ ఏపీసీ స్వామినాయుడు


