
అడ్డంకులు.. నిర్బంధం..అవమానం
ముఖ్యమంత్రి చంద్రబాబు పాడేరు పర్యటనలో అలవి కాని ఆంక్షలు.. అడుగడుగునా అడ్డంకులు.. పోలీసుల ఓవరాక్షన్‌తో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గిరిజనుల సమస్యలు చెప్పేందుకు వచ్చిన పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులను సీఎంను కలిసేందుకు అవకాశం కల్పించకుండా అగౌరవ పరిచారు. ఎమ్మెల్యేతోపాటు పార్టీ శ్రేణులను పోలీసులు నెట్టేశారు. సీఎంను కలిసేందుకు ప్రయత్నించిన ఆదివాసీ జేఏసీ, గిరిజన ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు అవకాశం ఇవ్వలేదు. హెలిప్యాడ్ పరిసర ప్రాంతాల్లోని గిరిజనులకు నిర్బంధం విధించారు. కొంతమందిని ఇళ్లు ఖాళీచేయించగా.. మిగతా వారిని ఇళ్లల్లోంచి బయటకు రాకుండా ఇబ్బందులు పాల్జేశారు.
సీఎం చంద్రబాబు పర్యటనలో అడుగడుగునా
ఆంక్షలు
పోలీసుల
ఓవరాక్షన్
పాడేరు : ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఏజెన్సీలో ప్రధాన సమస్యలను తీసుకువెళ్లేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ప్రయత్నించిన పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజును పోలీసులు అడ్డగించి నెట్టేయడం విమర్శలకు దారితీసింది. ఆహ్వానం మేరకు ఆదివాసీ దినోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించి అవమానపరిచారు. ఆదివాసీ ప్రాంతంలో సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఎంత చెప్పినా పోలీసులు వినలేదు. ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆయనను అధిక సంఖ్యలో మోహరించిన పోలీసులు నెట్టేశారు. దీంతో వారి మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు, కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా పాడేరు సెయింటాన్స్ స్కూల్ జంక్షన్ ప్రధాన రహదారి వద్ద ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, పార్టీ శ్రేణులు సుమారు మూడు గంటల పాటు బైఠాయించారు. వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
కుంటుపడిన గిరిజనాభివృద్ధి
కూటమి ప్రభుత్వం హయాంలో గిరిజన ప్రాంత అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరకు ఎన్నికల సభకు వచ్చిన చంద్రబాబు అధికారంలోకి వస్తే జీవో నంబరు 3ను పునరుద్ధరిస్తామని, స్పెషల్ డీఎస్సీతో భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక పూర్తిగా విస్మరించారన్నారు. 1/70 చట్టానికి తూట్లు పొడుస్తూ.. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడుతో చట్ట సవరణ కోసం మాట్లాడించి గిరిజనుల్లో భయాందోళనలకు గురి చేశారన్నారు. ఇంటింటికి రేషన్ వ్యవస్థ రద్దు చేయడంతో గిరిజనులు రేషన్ సరుకుల కోసం అష్టకష్టాలు పడుతున్నారన్నారు. గిరిజన ప్రాంతంలో డోలీ మోతలు ఎక్కువై గిరిజనులు పడుతున్న బాధలు అన్నీఇన్నీ కావన్నారు. వీటితోపాటు స్థానికంగా ఉన్న గిరిజన ప్రాంత సమస్యలపై తాను సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందించేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం సరికాదని ధ్వజమెత్తారు. ఆదివాసీ దినోత్సవంలో తాను హాజరై సమస్యలపై మాట్లాడితే గిరిజన ప్రాంతంపై కూటమి ప్రభుత్వం అసలు రంగు బయటపడుతుందనే ఉద్దేశపూర్వకంగా పోలీసులతో అడ్డుకుని అవమాన పరిచారన్నారు. తాను ఏమాత్రం వెనకడుగు వేసేది లేదని, గిరిజనులతో కలిసి మరింత ఉధృతంగా పోరాటాలు చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు.
ఆదివాసీల సంక్షేమం పక్కనబెట్టి..
ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో ఆదివాసీలకు ఏ మాత్రం సంబంధం లేని ఎక్కడో జరిగిన ఘటనలు, హత్యా రాజకీయాలపై మాట్లాడటంతో అన్ని వర్గాల ప్రజలు విసుగు చెందారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, చట్టాలు, హక్కులు, వారికి అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన మాట్లాడకపోవడం విమర్శలకు తావిచ్చింది. ఆయన పర్యటన సందర్భంగా మండలంలోని లగిసపల్లి వద్ద అధికారులు హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడకు సీఎం వచ్చి వెళ్లేంత వరకు ఆ ప్రాంతానికి కిలోమీటరు వరకు ఇళ్ల వద్ద ఎవ్వరూ ఉండకూడదని ముందుగానే హుకుం జారీ చేశారు. దీంతో కొంతమంది ఇళ్లు ఖాళీ చేయగా మిగతా వారు బయటకు రాకుండా ఇళ్లల్లోనే ఉండిపోయారు. హెలిప్యాడ్ నుంచి వంజంగి గ్రామం వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల మేర అడుగడుగునా పోలీసులు మోహరించారు. దీంతో దారిపొడవునా నివాసం ఉన్న ఆదివాసీ కుటుంబాలు చంద్రబాబు వచ్చి వెళ్లేంత వరకు భయంభయంగా గడిపాయి. ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు తమకు అవకాశం ఇవ్వకుండా టీడీపీ నేతలకు అధిక ప్రాధాన్యమిచ్చి ప్రజావేదిక వద్దకు పోలీసులు అనుమతించారని ఆదివాసీలు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎవరికోసం సీఎం పర్యటన?
ఆదివాసీ జేఏసీ జిల్లా కన్వీనర్
రామారావుదొర ఆవేదన
పార్టీ శ్రేణులతో రోడ్డుపై బైఠాయించి ఎమ్మెల్యే నిరసన
కూటమి ప్రభుత్వ చర్యలపై మండిపాటు
ఆదివాసీ జేఏసీ ప్రతినిధులను అడ్డుకున్న బలగాలు
గిరిజనుల సమస్యలు చెప్పేందుకు ప్రయత్నించిన
పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుకు అవమానం
పోలీసులు నెట్టేయడంతో ఉద్రిక్తత
పాడేరు రూరల్: ముఖ్యమంత్రి చందబాబు పర్యటన ఎవరి కోసమని.. మరోసారి మోసపోవడానికి తాము సిద్ధంగా లేమని ఆదివాసీ జేఏసీ జిల్లా కన్వీనర్ రామారావుదొర విమర్శించారు. చంద్రబాబుకు ఆదివాసీల సమస్యలు తెలియజేసేందుకు వెళ్తున్న ఆదివాసీ జేఏసీ, గిరిజన ఉద్యోగ సంఘాల నేతలను గొందూరు జంక్షన్ వద్ద పోలీసులు అడుకుని నిర్బంధించారు. ఈ సమయంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీల హక్కులు, చట్టాలు, సమస్యలపై సీఎంను కలిసి వినతిపత్రం ఇవ్వాలనుకున్న తమను పోలీసులు దౌర్జన్యంగా అడ్డుకోవడం ప్రజాస్వామ్యబద్ధంగా విరుద్ధమన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలుచేయకపోవడంపై నిలదీస్తారన్న భయంతోనే పోలీసులతో ఆదివాసీల ప్రతినిధులను అడ్డుకుని కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందన్నారు. ఇంకా ఎన్నాళ్లు ఆదివాసీలను మోసం చేస్తారని.. మేము మోసపోవడానికి సిద్ధంగా లేమన్నారు, ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు ఆదివాసీ నాయకులను రానీయకుండా చేయడం అన్యాయమన్నారు. చంద్రబాబు పర్యటన వల్ల ఆదివాసీలకు ఒరిగిందేమి లేదన్నారు. సొంత పార్టీ నేతలకు కూడా కార్యక్రమానికి రాకుండా ఆంక్షలు విధించడం కూటమి ప్రభుత్వానికే సాధ్యమన్నారు. భవిష్యత్తులో చంద్రబాబుకు ఆదివాసీల నుంచి తగిన గుణపాఠం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రతినిధులు చిట్టపుల్లి క్షనివాస్‌పడాల్ తదితరులు పాల్గొన్నారు.
అన్నివర్గాల్లో నిరుత్సాహం
సీఎం పర్యటన గిరిజన సంఘాలతో పాటు సొంత పార్టీ నేతలను నిరుత్సాహపరిచింది. ఆదివాసీ దినోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబుకు పలు సమస్యలు విన్నవించేందుకు వచ్చిన ఆదివాసీ విద్యార్థి, ఉద్యోగ, ప్రజాసంఘాలు, మహిళలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులకు అవకాశం లేకుండా పోయింది. సభా ప్రాంగణంలోకి సొంత పార్టీ నేతలను సైతం రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. అడుగడుగునా పోలీసుల ఆంక్షలతో ఇబ్బందులు పడ్డారు. చాలామంది నిరుత్సాహంతో వెనుదిరిగారు.

అడ్డంకులు.. నిర్బంధం..అవమానం

అడ్డంకులు.. నిర్బంధం..అవమానం

అడ్డంకులు.. నిర్బంధం..అవమానం