
ఏజెన్సీని ప్రైవేటుకు అప్పగించడమే చంద్రబాబు ధ్యేయమా?
అనంతగిరి (డుంబ్రిగుడ) :ఏజెన్సీని ప్రైవేటు కంపెనీలకు దారాదత్తం చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం అని అనంతగిరి ఎంపీపీ శెట్టి నీలవేణి ఆరోపించారు. ఆమె శనివారం విలేకరులతో మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా పాడేరు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి గిరిజన అభివృద్ధికి పలు కంపెనీలతో ఎంవోయూలు చేస్తున్నట్లు అట్టహాసంగా చెప్పడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. వివిధ కంపెనీలతో ఎంవోయూలు చేసినట్లు బహిరంగ ప్రకటించారని అందులో భాగంగా హోం స్టే టూరిజంను ఓయోతో ఒప్పందం చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే గిరిజన ప్రాంతంలోని గిరిజనుల ఇళ్లను గిరిజనేతరులైన ప్రైవేటు కంపెనీలతో ఏ విధంగా వ్యాపారం చేస్తారని ఆమె ప్రశ్నించారు. గిరిజనులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలు చట్టాలకు లోబడి ఉండాలన్నారు. 1/ 70 చట్టం అమలులో ఉన్న ఏజెన్సీలో ప్రైవేటు కంపెనీలను ఎలా ప్రోత్సహిస్తారు అని ప్రశ్నించారు. గిరిజనులను ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే ప్రభుత్వం గిరిజన సొసైటీలను ఏర్పాటు చేసి వారికి వివిధ ప్రాజెక్టులను అప్పగించవచ్చునని ఆమె పేర్కొన్నారు.ప్రైవేట్ కంపెనీలను ప్రోత్సహించడం సరికాదని ఆమె పునరుద్ఘాటించారు. ఏజెన్సీలో హైడ్రో పవర్ ప్రాజెక్టులను అదాని, నవయుగ కంపెనీలకు అప్పగించడంపై సర్వత్రా విమర్శలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నా, కనీసం ఆ విషయాన్ని ముఖ్యమంత్రి తన పర్యటనలో ఎందుకు ప్రస్తావించలేదని ఆమె ప్రశ్నించారు. ఆదివాసీ చట్టాలను పటిష్టంగా అమలు చేయకపోగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం రోజునే గిరిజన చట్టాలకు అతీతంగా గిరిజనేతరులైన ప్రైవేట్ కంపెనీలతో ఎంవోయూలు చేసుకోవడం సరికాదని ఆమె స్పష్టం చేశారు. ప్రతి ఇంటి మీద సోలార్ రూఫ్లను ఏర్పాటు చేసి వచ్చే కరెంటుతో ఎలక్ట్రికల్ బైక్లు, కార్లు తిప్పుకోవచ్చని చంద్రబాబునాయుడు చెప్పడాన్ని ఆమె తప్పు పట్టారు. గిరిజనులకు కార్లు తదితర వాహనాలు కొనుగోలు చేసుకునే స్తోమత ఎక్కడిదని ఆమె ప్రశ్నించారు. గిరిజన గ్రామాలకు రహదారులు, ఆర్టీసీ బస్సు సదుపాయం వంటి కల్పించాలని తప్ప లేనిపోని ఆశలు చూపి గిరిజనులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను చంద్రబాబు మానుకోవాలని ఆమె హితువు పలికారు.