
పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్ ప్రాంతం పరిశీలన
సీలేరు: పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు నిర్మించే ప్రాంతాలను ఆదివారం విజయవాడకు చెందిన ఏపీ జెన్‌కో ఉన్నతాధికారులు పరిశీలించారు. గూడెం కొత్తవీధి మండలం దుప్పులవాడ పంచాయతీ శాండీకొరి నుంచి చింతపల్లి క్యాంపు వరకు గల ప్రాంతాన్ని వారు సందర్శించారు. జలవిద్యుత్ కేంద్రం నిర్మించే పార్వతీనగర్, డైవర్షన్ డ్యాం నిర్మించే శాండికొరి, భూగర్భ టన్నెల్ కోసం సూచించిన పాయింట్లను వారు పరిశీలించారు. అటవీశాఖ అనుమతులు తుది దశకు చేరుకున్న సమయంలో ఆశాఖ నుంచి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వారు మరోసారి క్షుణ్ణంగా క్షేత్ర పరిశీలన చేశారు. భూగర్భ పైపులైన్ నిర్మాణ సందర్భంలో వచ్చే మట్టిని నిల్వ చేసేందుకు ప్రతిపాదించిన డంపింగ్ యార్డులు విషయంపై మరోసారి మరికొన్ని ప్రతిపాదనలు చేయనున్నారు. దీనిలో భాగంగా చింతపల్లి క్యాంపు లైక్ పూర్ ప్రాంతాల్లో ఉన్న ఖాళీ స్థలాలను కూడా వారు పరిశీలించారు. అయితే డంపింగ్ యార్డుకు చింతపల్లి క్యాంపు పరిసరాల్లో స్థలాన్ని కూడా ప్రతిపాదించే అవకాశమున్నట్లు జెన్‌కో అధికారవర్గాలు తెలిపాయి. ఈ పరిశీలనలో చీఫ్ ఇంజినీర్లు (సివిల్) రవీంద్ర రెడ్డి, (ఓఎండ్‌ఎం) కేవీ రాజారావు, ఈఈ (సివిల్) రత్నకుమార్, డీఈఈ అప్పలనాయుడు పాల్గొన్నారు.