
ఏజెన్సీలోనే కాఫీ ప్రాసెసింగ్ యూనిట్
పాడేరు : అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి సమీపంలోని శెట్టివానిపాలెంలో ఏర్పాటు చేయనున్న కాఫీ ప్రొసెసింగ్ యూనిట్‌ను అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి తరలించాలని ఆదివాసీ జేఏసీ జిల్లా చైర్మన్ రామారావు దొర డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక జీఎస్‌యూ భవనంలో ఆదివాసీ జేఏసీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 2లక్షల ఎకరాల్లో కాఫీ గిరిజన రైతులు సాగు చేస్తున్నారన్నారు. వీరికి స్థానికంగా అందుబాటులో ఉండేలా కాఫీ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏజెన్సీలో ఏర్పాటు చేయాల్సింది పోయి మైదాన ప్రాంతంలో ఏర్పాటు చేయడం ఏమిటన్నారు. ఈ వ్యవహారంలో రాజకీయ కుట్ర దాగి ఉందన్నారు. స్థానికంగా కాఫీ ప్రాసెసింగ్ ఏర్పాటు చేస్తే నిరుద్యోగ గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. గిరిజనులు పండిస్తున్న అన్ని సేంద్రియ అటవీ, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా ఆదివాసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చిట్టపులి శ్రీనివాస పడాల్, వర్కింగ్ ప్రెసిడెంట్ సొమెలి సింహాచలం, గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ముఖీ శేషాద్రి, నాయకులు ఈశ్వరరావు, కేశవరావు, వరకిశోర్ పాల్గొన్నారు.
ఆదివాసీ జేఏసీ చైర్మన్
రామారావు దొర డిమాండ్